ఫుల్‌గా.. జే బ్రాండ్‌లే!
ABN , First Publish Date - 2023-08-30T00:50:52+05:30 IST
గతంలో ఎంసీ, ఐబీ, వీఎస్‌వోపీ, సిగ్నేచర్ ఇలా బ్రాండు పేరు చెప్పి కొనుక్కునేవాళ్లు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో పేరు పూటకో సరుకు అన్న చందంగా దరిద్రం దాపురించడం తో బ్రాండ్లు గుర్తుండే పరిస్థితి లేదు.
బ్రాండ్‌లన్నీ.. బ్రాంతియే
ఏపీకి రాని ఎంఎన్‌సీలు
‘ప్రీమియం మాయం’
స్కార్చ్ దొరకదు
బ్రాండ్లు లేక బార్లు డీలా
నికార్సైన సరుకుకు ఏనాడో స్వస్తి
అందుకే మంచి బ్రాండ్లు నిల్
మూడేళ్లగా కొత్త కిక్..
ధరల బాదుడుతో జేబు గుల్ల
రేపు 170 షాపుల గడువు ముగింపు
నూతన మద్యం పాలసీపై కసరత్తు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
గతంలో ఎంసీ, ఐబీ, వీఎస్‌వోపీ, సిగ్నేచర్ ఇలా బ్రాండు పేరు చెప్పి కొనుక్కునేవాళ్లు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో పేరు పూటకో సరుకు అన్న చందంగా దరిద్రం దాపురించడం తో బ్రాండ్లు గుర్తుండే పరిస్థితి లేదు. ఏపీలో దొరికే బ్రాండ్లు దేశంలో ఎక్కడా కనబడవు.. అన్ని రాష్ట్రాల్లో ఉండే మందు ఏపీలో లభ్యం కాదు. కొద్ది నెలలుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 90 శాతం జగనన్న బ్రాండ్లే దర్శన మిస్తున్నాయి. బార్లలో సైతం మంచి బ్రాండ్లు దొరకడం లేదు. ప్రీమియం బ్రాండ్ల కంపెనీలు ఎప్పుడో చేతులెత్తేయగా.. స్కార్చ్ బ్రాండ్లు కనుమరుగైపోయాయి. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో పెద్ద కంపెనీల బ్రాండ్లు అమ్మేవారు. చీప్ లిక్కర్ కూడా నాణ్యంగా ఉండేది. కానీ, నాలుగేళ్ల నుంచీ మందుబాబులకు ప్రతికూల కాలం నడుస్తోంది.
ఎంఎన్‌సీలు కనుమరుగు..
మల్టీ నేషనల్ కంపెనీ(ఎంఎన్‌సీ)లు కూడా ఏపీలో అమ్మ కాలు సాగించడానికి ముందుకు రావడం లేదు. బతిమలా డుతున్నా బడ్‌వైజర్ ససేమిరా అంటోంది. ప్రీమియం బ్రాండ్ల తయారీదారులైన సియాగ్రామ్స్, మెక్‌డోవెల్, షావాలెస్, బకార్డీ వంటి ఎంఎన్‌సీలు ఏపీకి స్వస్తి చెప్పాయి. ఏపీలో మద్యం దుకాణాలు స్కార్చ్ మర్చిపోయి మూడేళ్లు దాటి పోయింది. 100 పైపర్స్, 12 ఇయర్స్, సిగ్నేచర్, బ్లెండర్స్ ప్రైడ్, మార్ఫియస్, డబుల్ బ్లాక్, జానీ వాకర్, వ్యాట్ 69, బ్లాక్‌డాగ్, ఏసీ బ్లాక్, జేమ్స్ అండ్ ఐరిష్, బ్లాక్ లేబుల్, మేజిక్ మూమెంట్, ఇంపీరియల్ బ్లూ, వాలైంటీన్, సివోస్ ఈగిల్ టీచర్స్, దివార్స్, విల్లియమ్ లాసెన్స్, ఏసీ బ్లాక్, యాంటిక్విటీ బ్లూ, ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాందీ తదితర బ్రాండ్లు ఏపీలో కనుమరుగైపోయాయి. ఎక్కడా ఇవి లభ్యం కావడం లేదు. రాయల్ రైట్, రాయల్ ప్యాలెస్, గోల్డెన్ పెరల్స్, కింగ్స్ వెల్, ఆంధ్రాగోల్డ్, క్లాసిక్ బ్లూ తదితర లోకల్ రకాలు దుకాణాల్లో పూటుగా దొరుకుతున్నాయి. గతంలో లభ్యమయ్యే వాటిలో బీ7, బీ 10, ఎంహెచ్, కైరన్, 8 పీఎం, ఆల్ సీజన్స్ బార్లలో అక్కడక్కడా ఉంటున్నాయి. నాకవుట్, ఖజురహో, కార్ల్స్ బెర్గ్, బడ్వయిజర్ వంటి బీర్లు తాగాలాంటే పక్క రాష్ట్రాలకు వెళ్లా ల్సిందే. ఇక్కడ మాత్రమే దొరికే బ్రిటిష్ ఎంపైర్, బూమ్ బూమ్ ముంచెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వ మద్యం దుకా ణాల్లో జగన్ బ్రాండ్లు మాత్రమే ఉంటున్నాయి.
డబ్బులు వాడేసుకోవడంతో..
మందు అమ్మకాల్లో వచ్చే డబ్బులను తయారీ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించలేకపోతోంది.దీంతో పెద్ద కంపెనీలు ఏ పీలో అడుగు పెట్టడం లేదు. ఓ కంపెనీ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ సాఫీగా ఉండేది. పెద్ద కంపెనీలు ఎగబడి మరీ వచ్చి అమ్మకాలు జరిపేవి. దీంతో మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి డిపోలకు తరలిస్తుంది. ఇక్కడి నుంచి మద్యం దుకాణాల వాళ్లు కొని తీసుకెళ్తారు. గత ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. వాళ్లు డబ్బులు(డీడీలు) చెల్లించి డిపోల నుంచి కొనుక్కొనేవారు. ఆ డబ్బులు ప్రభుత్వ ఖజా నాకు చేరిన తర్వాత కంపెనీలకు చెల్లించడానికి 92 రోజులు సమయం ఉండేది. ప్రభుత్వం ఒకవేళ వేరే అసరాలకు వాడు కున్నా ఆర్థిక క్రమశిక్షణ వల్ల గడువు తీరకముందే కంపెనీ (డిస్టిలరీ)లకు డబ్బు చేరేది.కానీ ఈ ప్రభుత్వం వచ్చాక తమ బ్రాండ్ల అమ్మకాలకు ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరపైకి తెచ్చింది.డిపోల నుంచి ఈ దుకాణాలకు మందు పంపిస్తారు. అక్కడ అమ్మిన వాటికే డబ్బులను డిపోలకు పంపిస్తారు. ఇవి ప్రభుత్వ ఖజానాకు జమవుతాయి. ప్రభుత్వం ఈ డబ్బును వాడేసుకొని కంపెనీలకు చెల్లించడం లేదు. గట్టిగా అడిగిన వాళ్లపై వైసీపీ తీరు తెలిసిందేగా. ఇలా గజిబిజి గందరగోళం సృష్టించి పెద్ద కంపెనీలను ఉద్దేశపూర్వకంగా రానీయకుండా జనాల ఆరోగ్యంతో ఆటలాడుకొంటూ లోకల్ బ్రాండ్లతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు.
బార్ల యజమానుల బోరుబోరు..
గత ప్రభుత్వాల్లో వందల కోట్లలో వ్యాపారాలు చేసిన బార్ల యజమానులు సైతం జగన్‌కి ఒక్కచాన్స్ ఇచ్చి బెంబేలెత్తిపో తున్నారు.గతంలో రోజుకు సుమారు రూ.2.5లక్షల అమ్మకాలు క్రమేపీ రూ.1లక్షకు పడిపోయాయి. జగనన్న మతలబే దీనికి కారణంగా చెప్పవచ్చు.ఎన్ని వెసులుబాట్లు కల్పించినా బ్రాం డ్లు లేకపోవడంతో అమ్మకాలు నెమ్మదించాయి.ఓ పది రకాలు మాత్రమే దుకాణంలో విక్రయాలు సాగించాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారం పడిపోయింది. దీంతో గతంలో సంపాదిం చుకున్న సొమ్మంతా ఇప్పుడు పోగొట్టుకుంటున్నారు. పైసా వెనకేసుకోగపోగా ఇంట్లో డబ్బు తెచ్చి వ్యాపారంలో పెట్టినా నష్టమే కళ్లజూస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లకో సారి బార్ల యజమానులు రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొందరు ఇంకా చెల్లించలేని దుస్థితిలోకి దిగజారిపోయారు.ఇంకా జిల్లాలో సుమారు రూ.2 కోట్లు రెండు మూడు బార్లు చెల్లించాల్సి ఉంది.
మందుబాబుల్లో ఆ ప్రశ్న ఏమైంది?
గత ప్రభుత్వంలో పాలకులకు తెలియకుండా మద్యం క్వార్టర్ (180ఎంఎల్) బాటిల్‌పై రూ.120 ఎమ్మార్పీ ఉంటే కేవలం రూ.10 అదనంగా తీసుకుంటే మద్యపానప్రియులు గగ్గోలు పెట్టేవాళ్లు. రచ్చ చేయడానికీ వెనకాడేవాళ్లు కాదు. అదే మందును ఇప్పుడు ఎమ్మార్పీ రూ.200 చేసేశారు. దీనిపై బెల్టు షాపుల్లో రూ.30-50, బార్లలో రూ.60 అదనంగా లాగేస్తున్నారు. బీర్ల ధరలు మరీ దారుణం. ప్రీమియం బ్రాం డు బీరు గత ప్రభుత్వంలో రూ.120 ఉండేది. వ్యాపారంలో పోటీ కారణంగా కొన్ని దుకాణాల్లో రూ.100కి రెండు మూడు బీర్లూ అమ్మేవారు. ఇప్పుడు బీరు ధర అధికారికంగా రూ.200, 220 చేసేశారు. దీనిపై అదనంగా రూ.80-100 తీసుకుం టున్నారు. అంటే అప్పట్లో రూ.120 బాటిల్ రూ.130 తీసు కుంటే గొడవ పెట్టేవాళ్లు. ఇప్పుడు అదే మందు రూ.230-260 తీసుకున్నా ఎవరూ మాట్లాడడం లేదు. బీర్లపై మరీ దారుణంగా దోచేస్తున్నా ప్రశ్నించేవారే లేదు. దీంతో మందు అలవాటు ఉన్న వాళ్లు లక్షల్లో నష్టపోతున్నారు.