ప్రకృతి సంపద.. పలహారం!
ABN , First Publish Date - 2023-02-12T23:55:35+05:30 IST
చేబ్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఎర్రగ్రావెల్ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది.

చేబ్రోలు, ఫిబ్రవరి 12: చేబ్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఎర్రగ్రావెల్ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలో వీరనాయకుని పాలెం, శేకూరు, శలపాడు, సుద్దపల్లి తదితర గ్రామాల్లో ఎర్రమట్టి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. దీనికి జిల్లావ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.
చేబ్రోలు మండలంలో ఒక్కరికీ మైనింగ్ అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ రోజూ చేబ్రోలు పరిసర గ్రామాల నుంచి జిల్లావ్యాప్తంగా రాత్రింబవుళ్లు అక్రమంగా వందలాది లారీలు గ్రావెల్ రవాణా సాగిస్తున్నాయి. ప్రభుత్వ పనుల ముసుగులో ప్రకృతి సంపదను స్వాహా చేస్తున్నా అడిగే అధికార యంత్రాంగం లేకుండా పోయింది. ఓ వైపు అధికారుల కమిటీ అసలు మైనింగ్ జరగనట్లు అంతా సక్రమంగానే ఉందని ఉన్నతాధికారులకు నివేదికను పంపించడం స్థానికులను అయోమయానికి గురిచేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి వందల అడుగుల లోతులో భూమిని తొలచి మైనింగ్‌కు పాల్పడడమే కాకుండా పరిమితికి మించి లోడుతో భారీ టిప్పర్ యంత్రాలు ఎర్రమట్టిని అక్రమ రవాణా చేస్తున్నప్పటికి ఇవేమి అధికారుల కళ్లకు అక్రమాలుగా కనిపించకపోవడం విచిత్రంగా ఉంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా..
ఇటీవల శేకూరు, వీరనాయకునిపాలెం, శలపాడు గ్రామాల్లో వైసీపీ నాయకుల అండదండలతో అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పోరుబాట పట్టారు. మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్‌పై సర్వే నెంబర్లు, రవాణా చేసిన లారీల నెంబర్లు, రవాణా అయిన గ్రావెల్ టన్నుల సహా వివరాలను నరేంద్రకుమార్ స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారుల కమిటీ వేశారు. అయితే ఈ కమిటీ అక్రమాలకు జరిగిన క్వారీలను సందర్శించకుండా ఉన్నతాధికారుల కళ్లు కప్పే ప్రయత్నం చేసిందని సర్వత్రా ఆరోపణలు వినివస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల ప్రకారమే అక్రమ మైనింగ్‌ను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది.
అధికారుల ఆదేశాలు భేఖాతరు
చేబ్రోలు మండంలో 2011లో క్వారీలో గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందడంతో కదలిన అధికార యంత్రాంగం వేజెండ్ల, శుద్దపల్లి గ్రామాల్లో మైనింగ్‌ను నిషేధిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సైతం తుంగలోకి తొక్కిన వైసీపీ నాయకులు ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇటీవల సంగంజాగర్లమూడి దారిలో వంతెన శిథిలమైంది. దీనిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులను సైతం బేఖాతరు చేస్తూ శిథిల వంతెనపై నుంచే 50 టన్నుల లోడ్ ఎర్ర గ్రావెల్‌ను రవాణా చేస్తున్నారు.
అధికార పార్టీ అండదండలు
గ్రావెల్ అక్రమ తవ్వకాల దందాలో అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోనే పొరుగు మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త అక్రమ మైనింగ్ చేస్తున్నప్పటికీ అధికారుల కమిటీ ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడకపోగా ఆ క్వారీ సంగతి తరువాత చూద్దాంలే అని అన్నారంటే ప్రలోభాల పర్వం ఎంత వరకు కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. శేకూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత సమీప గ్రామాలలో పెద్దఎత్తున మైనింగ్ చేస్తున్నప్పటికీ, సాక్షాత్తూ మాజీ ఎమ్మెల్యే ఆ మైన్‌లో ధర్నా చేసినప్పటికీ అధికారుల కమిటీ అక్కడ మైనింగే జరగనట్లు వ్యవహరిస్తోంది. సుమారు 50 ఎకరాల్లో 200 అడుగులకు లోతుగా ఈ క్వారీలలో సదరు వైసీపీ నేత తమ భాగస్థులతో తవ్వేసారు. ఈ మైన్‌లో ఓ కీలక నాయకుడికి సైతం భాగస్వామ్యం ఉందని అందుకే అధికారుల కమిటీ ఆ క్వారీ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరనాయకునిపాలెంలో నిరుపేద దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని సైతం అక్రమ మార్గంలో చేజిక్కుంచుకున్న మరో వైసీపీ నేత దళితులు సాగు చేసిన పండ్ల తోటలను సైతం ధ్వంసం చేసి అక్రమ మైనింగ్ పాల్పడ్డారు. ఇలా ఏ గ్రామంలో చూసినా అధికారం అండ మాటున గ్రావెల్ అక్రమ దందాలే చేబ్రోలు మండంలో దర్శనమిస్తున్నాయి.