ఎటుచూసినా క్వారీలే

ABN , First Publish Date - 2023-02-24T01:03:34+05:30 IST

అధికార పార్టీ నేతల అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అడిగే వారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో దర్జాగా రాత్రింబవళ్లు మట్టి లారీలు ఠీవీగా రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.

ఎటుచూసినా క్వారీలే
ఒక క్వారీలో మూడు ప్రొక్లయినర్లతో జరుగుతున్న మట్టి తవ్వకాలు

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 23: అధికార పార్టీ నేతల అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అడిగే వారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో దర్జాగా రాత్రింబవళ్లు మట్టి లారీలు ఠీవీగా రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు కళ్లుమూసుకుని నిద్ర నటిస్తున్నారు. గుంటూరు రూరల్‌ మండలం నాయుడుపేట అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో మట్టిని బొక్కేస్తున్నా అడ్డుకునే వారే లేరు. నాయుడు పేట వద్ద గుంటూరు డంపింగ్‌ యార్డు సమీపంలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో వందల అడుగుల తోతులో మట్టిని తవేస్తున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కనుచూపు మేరలో పెద్ద పెద్ద లోయలను తలపించే విధంగా క్వారీలు ఉన్నాయి. అడుగున నీళ్లు ఊరే వరకు మట్టిని తవ్వుతూనే ఉన్నారు. నాయుడుపేట సమీపంలో రెండు చోట్ల మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. సుమారు ఏడెనిమిది ఎక్స్‌కవేటర్ల ద్వారా తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒక టిప్పర్‌ మట్టి లోడుతో బయటకు వస్తుంది.

జగనన్న కాలనీకి అతి సమీపంలో...

నాయుడుపేట సమీపంలోని జగనన్న కాలనీని అనుకునే క్వారీలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ గృహ నిర్మాణం కూడా పూర్తయి కొంత మంది ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. దీనికి తోడు సమీప ప్రాంతాలకు చెందిన రైతులు తమ గేదెలను కొండలవైపుకి తీసుకెళ్లి మేపుకొస్తుంటారు. అటు ప్రజలకు, ఇటు పశువులకు ఈ క్వారీలు ప్రమాదకరంగా ఉన్నాయి.

నేత కుటుంబ సభ్యుల అండదండలతో...

ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత కుటుంబ సభ్యుల కనుసన్నల్లో, మట్టి మాఫియా ఇక్కడ పెట్రేగి పోతుంది. మట్టి తవ్వకాలను ఏ ఒక్క అధికారి, పోలీసు కాని అడ్డుకునే ప్రయత్నం చేయక పోవడానికి కారణం ఆ నేత అండేనని పలువురు ఆరోపిస్తున్నారు. గుంటూరుకు కూతవేటు దూరంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తమ ఖజానా నింపుకుంటూ అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ముఖ్యమంత్రి కలుగజేసుకుంటనే...

నాయుడుపేట వద్ద జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌ విషయంలో ముఖ్యమంత్రి కలుగజేసుకుంటనే తప్ప మట్టి తవ్వకాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు అక్రమ మట్టి తవ్వకాల విషయంలో పత్రికలలో పతాక శీర్షికన కథనాలు ప్రచురితమైన సమయంలో రెండు రోజులు మట్టి తవ్వకాలు ఆపడం, ఆ తరువాత తిరిగి యఽథావిధిగా మొదలు పెట్టడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వంలో ముఖ్యపెద్దల ఆదేశాలు ఉండటమో.. మరే ఇతర కరణమో కాని అటు పోలీసులు, ఇటు మైనింగ్‌ అధికారులు, జిల్లా అధికారులు ఆపే ప్రయత్నం చేయడం లేదు.

Updated Date - 2023-02-24T01:03:35+05:30 IST