Student Tabs UN Useless : ట్యాబ్‌లు.. డాబుకే

ABN , First Publish Date - 2023-08-29T03:57:34+05:30 IST

ట్యాబ్‌లు(tabs) ఇవ్వగానే విద్యార్థుల జీవితాలు మారిపోతాయన్నట్టుగా జగన్‌ సర్కారు(Jagan Govt) బిల్డప్‌ ఇచ్చింది. అదిగో ట్యాబ్‌, ఇదిగో బైజూస్‌ కంటెంట్‌(Byjus content) అంటూ ఊదరగొట్టింది. గతేడాది చివర్లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి ట్యాబ్‌లు పంపిణీ చేసింది.

Student Tabs UN Useless : ట్యాబ్‌లు.. డాబుకే

సర్కారు గొప్పలు మూణ్నాళ్ల ముచ్చటే..

నిరుపయోగంగా విద్యార్థుల ట్యాబ్‌లు

గతేడాది చివర్లో ఇచ్చి నానా హడావుడి

ఈ ఏడాది పట్టించుకునేవారే కరువు

సరైన ప్రణాళిక లేదు.. పర్యవేక్షణా లేదు

విద్యార్థులకు అర్థం కాని బైజూస్‌ కంటెంట్‌

మరోవైపు మరమ్మతులతో మూలకు

ట్యాబ్‌లను బడికే తీసుకురాని పరిస్థితి

686 కోట్లు బూడిదలో పోసిన ప్రభుత్వం

ల్యాప్‌టా్‌పపై మాట తప్పిన జగన్‌ మామ

భారం తగ్గించుకునేందుకు తెరపైకి ట్యాబ్‌లు

విద్యార్థులకు ల్యాప్‌

ల్యాప్‌టాప్‌లు ఇస్తామని రెండేళ్ల క్రితం సీఎం జగన్‌ గొప్పలు చెప్పారు. ఓ చేత్తో ల్యాప్‌టాప్‌ పట్టుకుని చూపించి మరీ పిల్లలకు ఆశ పెట్టారు. ఆచరణలోకి వచ్చేసరికి జగన్‌ మామ మాట తప్పారు. ఆ హామీని నెరవేర్చలేక చివరకు ట్యాబ్‌లు చేతిలో పెట్టారు. అదీ 8వ తరగతి విద్యార్థులకే పరిమితం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా, ప్రయోజనాల గురించి ఆలోచించకుండా హడావుడి చేశారు

ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేసిన బైజూస్‌ కంటెంట్‌ అర్థం కాకపోవడంతో గ్రామీణ విద్యార్థులు వాటిని పక్కన పడేశారు. ప్రస్తుతం చాలామంది ట్యాబ్‌లు వాడటం లేదు. పలు కారణాలతో అవి పనిచేయకపోవడంతో కొందరు మూలన పడేశారు. ఇంకొందరు వినోద కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారు. సర్కారు ఇచ్చిన ట్యాబ్‌ల పరిస్థితి ఇదీ. అయినా ప్రభుత్వం లోపాలు గుర్తించకుండా ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పంపిణీకి సిద్ధమవుతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ట్యాబ్‌లు(tabs) ఇవ్వగానే విద్యార్థుల జీవితాలు మారిపోతాయన్నట్టుగా జగన్‌ సర్కారు(Jagan Govt) బిల్డప్‌ ఇచ్చింది. అదిగో ట్యాబ్‌, ఇదిగో బైజూస్‌ కంటెంట్‌(Byjus content) అంటూ ఊదరగొట్టింది. గతేడాది చివర్లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థులతోపాటు టీచర్లకూ ఇచ్చింది. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. టీచర్లకు పాఠాలు చెప్పేందుకే సమయం చాలక సతమతమవుతుంటే వారికి అదనంగా ట్యాబ్‌లు అంటగట్టింది. బైజూస్‌ విధానం ఏమిటో విద్యార్థులకు అర్థం కావడం లేదు. ట్యాబ్‌లు ఉపయోగించే తీరిక, వాటితో వచ్చే ప్రయోజనం అటు టీచర్లకు, ఇటు విద్యార్థులకు లేకుండా పోయాయి. మొత్తంగా రూ.686 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ట్యాబ్‌ల పేరిట కంపెనీలకు ఇచ్చి మేలు చేకూర్చింది. కొవిడ్‌ కాలంలో వెలుగులోకి వచ్చిన బైజూస్‌ కంటెంట్‌ను ప్రైవేటు విద్యా సంస్థలే తీసి పక్కన పడేస్తే, ప్రభుత్వం మాత్రం అదే కావాలంటూ మెడకు తగిలించుకుంది. తీరా ఇప్పుడు దాన్ని వదిలించుకోలేక, ట్యాబ్‌ల విషయంలో ఏంచేయాలో పాలుపోక అయోమయంలో పడిపోయింది. ముందూ వెనుకా చూడకుండా హామీలిచ్చే అలవాటున్న సీఎం జగన్‌ రాజకీయ మైలేజీ కోసమే ట్యాబ్‌ల పంపిణీని తెరపైకి తెచ్చారు. రెండేళ్ల కిందట బహిరంగంగా ప్రకటించిన ల్యాప్‌టాప్‌ల హామీ మరిచిపోయేలా చేసేందుకు, ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అందులోనూ 9 నుంచి ఇంటర్‌ వరకూ ఇవ్వాల్సి ఉండగా, కేవలం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ట్యాబ్‌ ఒక్కటే ఇస్తే బాగోదని ఉచితంగా ఇస్తామన్న బైజూస్‌ కంటెంట్‌ను వాటిలో అప్‌లోడ్‌ చేశారు.

ప్రచారార్భాటమే

గతేడాది డిసెంబరు 21న సీఎం జన్మదినం సందర్భంగా 4,59,564 మంది విద్యార్థులకు అట్టహాసంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వారితో పాటు ఎనిమిదో తరగతికి పాఠాలు చెప్పే 59,176 మంది టీచర్లకూ ట్యాబ్‌లు ఇచ్చారు. ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.12,800 కాగా, కంటెంట్‌తో కలిపి విలువ రూ.32 వేలు అని ప్రచారం చేశారు. ఇందుకోసం రూ.686 కోట్లు ఖర్చు చేశారు. అయితే వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఎలాంటి ప్రణాళికా అమలు చేయలేదు. బైజూస్‌ కంటెంట్‌లో గణితం, సైన్స్‌, సోషల్‌ ఉంటాయి. ట్యాబ్‌లు ఇచ్చిన కొత్తలో రోజుకు గంట పాటు వాటిని వినియోగించాలనే నిబంధన పెట్టారు. టీచర్లు కూడా విధిగా వాడాలని షరతు పెట్టారు. దానిపై కొంతకాలం డేటా కూడా సేకరించారు. అనంతరం వాటిని పూర్తిగా మరిచిపోయారు. ఈ ఏడాది బడులు తెరిచి రెండున్నర నెలలు అయినా ఇంతవరకూ వాటిని ఏం చేయాలనే స్పష్టత ఎవరికీ లేదు. ప్రతి శుక్రవారం ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను అప్‌డేట్‌ చేస్తున్నారు. చూడాలనుకుంటే ఇంటి వద్ద చూసుకోండి అన్నట్టుగా వదిలేశారు. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలకే సమయం చాలట్లేదని, ఈ ట్యాబ్‌ల గోల ఏంటని విద్యార్థులు వాటిని మూలన పడేశారు. గతేడాది ట్యాబ్‌లు ఇచ్చిన కొత్తలో చాలా మంది పాటలు వినడానికి, సినిమాలు, వీడియోలు చూడటానికి వినియోగించారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో విద్యా శాఖ.. ట్యాబ్‌లలో వేరే కంటెంట్‌ రాకుండా లాక్‌ చేసింది. దీంతో వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత అవి పూర్తిగా మూలనపడ్డాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు వాటిని బడులకు తేవడం కూడా మానేశారు. అయితే కొందరు విద్యార్థులు టెక్నాలజీ ఉపయోగించి మళ్లీ పాటలు వినడానికి, వీడియోలు చూసేందుకు ట్యాబ్‌లను వాడుకుంటున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఉపయోగిస్తున్నారు.


బైజూస్‌ కంటెంట్‌ అవసరమా?

ట్యాబ్‌లపై విద్యార్థులతో పాటు టీచర్లలోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న తమకు ఇప్పుడు కొత్తగా బైజూస్‌ కంటెంట్‌ అవసరం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటారనే భయంతో టీచర్లు అంతర్గతంగా తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇన్నేళ్లు ఈ కంటెంట్‌తోనే పాఠాలు చెప్పామా? అని ప్రశ్నిస్తున్నారు. పైగా ట్యాబ్‌లను విద్యార్థులకు పరిమితం చేయకుండా టీచర్లకూ ఇచ్చి, రోజూ చూడాలనే కండీషన్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దీనిని తప్పనిసరి చేసిన సమయంలో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ రాజకీయ లబ్ధి కోసం తమపై లేనిపోనివి పెడుతోందని అంటున్నారు.

1.jpg

పనితీరు అంతంతే..!

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ట్యాబ్‌లు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. వాటికి మరమ్మతులు వస్తే పరిష్కరించే సదుపాయం లేదు. విశాఖపట్నం ఎన్జీవో కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 127 మందికి ట్యాబ్‌లు ఇచ్చారు. వాటిలో 32 మాత్రమే పనిచేస్తున్నాయి. అనకాపల్లిలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 123 మందికి ఇవ్వగా.. 30కిపైగా మరమ్మతులకు గురయ్యాయి. విజయనగరం జిల్లాలో 30 శాతం వినియోగంలో లేవు. పార్వతీపురం మన్యం జిల్లాలో 60 ట్యాబ్‌లకు డిస్‌ప్లేలు డ్యామేజ్‌ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట, గార మండలాల్లో మెమొరీ కార్డులు ఇవ్వలేదు. నందిగాం, పలాస మండలాల్లో 20 శాతం మరమ్మతులకు గురయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 వేల ట్యాబ్‌లలో సాఫ్ట్‌వేర్‌ సమస్య తలెత్తింది. చిత్తూరు జిల్లాలో 21,629 ట్యాబ్‌లు ఇవ్వగా.. 200కుపైగా స్ర్కీన్‌ డిస్‌ప్లే పోయింది. తిరుపతి జిల్లాలో 40 శాతం ట్యాబ్‌లు పనిచేయడం లేదు. కడప జిల్లాలో 15,913 ట్యాబ్‌లకుగాను 30 శాతం పనిచేయడం లేదు. కృష్ణా జిల్లాలో 14,200 ట్యాబ్‌లు ఇస్తే.. సుమారు నాలుగు వేలు మరమ్మతులకు వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 25 శాతం సరిగా పనిచేయడం లేదు.

ట్యాబ్‌లలో ఖుషీఖుషీ

అనంతపురంలోని ఓ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్థి తన ట్యాబ్‌లో ఉన్న సఖి, 90 ఎంఎల్‌ సినిమా పాటలను క్షణాల్లో హైడ్‌ చేసి చూపించాడు. ట్యాబ్‌ నుంచి వాటిని డిలీట్‌ చేసి.. ఆ వెంటనే రీస్ట్టోర్‌ చేశాడు. పాఠశాల విద్యా శాఖ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినా, విద్యార్థి తన తెలివితేటలు చూపించాడు. ఇదే స్కూల్‌లో చాలామంది విద్యార్థుల ట్యాబ్‌లు పనిచేయడం లేదు. ట్యాబ్‌ల వల్ల చదువు సంగతి అటుంచితే, విద్యార్థులు పెడదోవ పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-08-29T04:42:15+05:30 IST