Share News

Gold : షాకింగ్.. కడప జిల్లా ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్.. అసలేం జరిగింది..?

ABN , First Publish Date - 2023-10-22T18:49:33+05:30 IST

హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది...

Gold : షాకింగ్.. కడప జిల్లా ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్.. అసలేం జరిగింది..?

హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది. బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబై ఖ్యాతి గడించిందన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారీగా అక్రమ బంగారం (Godld) దిగుమతి అవుతోందనే పక్కా సమాచారంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాల‌తో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో ఏక కాలంలో విజ‌య‌వాడ‌, తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ నాలుగు దుకాణాల్లోనూ బిల్లులు లేని లేని 300 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తరలింపు జరిగినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన ఈ బంగారాన్నతంటిని అట్టపెట్టెలు, సూటుకేసుల్లో భద్రపరిచి జాగ్రత్తగా వాహనాల్లో తిరుపతికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం అంతా బిల్లులు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నదేనని ఐటీ చెబుతోంది. పసిడి వ్యాపారానికి పేరొందిన ప్రొద్దుటూరులో ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేయడం గమనార్హం.


Gold-1.jpg

రైళ్లు పరిగెడుతున్నాయ్..!

కాగా.. ప్రొద్దుటూరు టౌన్‌లో సుమారు రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజూ కోట్లల్లోనే వ్యాపారం సాగుతుంటుంది. అలాంటిది ఈ ఐటీ సోదాలతో షాపులు మూతపడి బోసిపోయినట్లుంది. తాజాగా నాలుగు ప్రముఖ దుఖాణాల్లో జరిగిన ఐటీ సోదాలతో మిగతా బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. రేపొద్దున ఇదే తనిఖీలు తమదాకా వస్తాయేమో అనే ఆందోళనతో బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. కొందరు వ్యాపారులు భయపడి షాపులు మూసేస్తుండగా.. మరికొందరు బాబోయ్ ఈ వ్యాపారమే వద్దనుకుంటున్నారట. సరిగ్గా పండుగ సమయంలో ఇలా బంగారు దుకాణాలు మూతపడటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓ వైపు దసరా.. మరోవైపు పెళ్లిళ్ల సమయం కూడా కావడంతో బంగారం ప్రియులు, కొనుగోలుదారులు ప్రొద్దుటూరులోనే ఉంటూ.. ఎప్పుడెప్పుడు దుకాణాలు తెరుస్తారా..? అని ఎదురుచూస్తున్నారట.

Gold.jpg

బంగారం వ్యాపారమే ఎందుకు..?

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారినికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది..? ఎందుకింత పాపులర్ అయ్యింది..? అనే విషయాలపై నగరానికి చెందిన పెద్దలు కథలు కథలుగా చెబుతుంటారు. పూర్వం ఈ ప్రొద్దుటూరుకు చెందిన జనాలు చాలా వరకు నీలి మందు వ్యాపారం చేసేవారు. ఇక్కడ తయారుచేసి నేపాల్, భూటాన్, శ్రీలంకతో పాటు పలుదేశాలకు ఈ మందును ఎగుమతి చేసేవారు. క్రమంగా నీలి మందు వ్యాపారం మందగించడంతో ఇక ప్రత్యామ్నాయం ఏముందని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఎప్పటికీ మార్కెట్ తగ్గనిది.. వస్తువుకు తగ్గట్టుగా డబ్బు వచ్చేది ఒకే ఒక్క బంగారం వ్యాపారమేనని గ్రహించి.. పెద్ద ఎత్తున బంగారం వ్యాపారం ప్రారంభించేశారు. రోజుల వ్యవధిలోనే పదులు, వందలు, వేల సంఖ్యలో దుకాణాలు ప్రారంభమయ్యాయి. మరికొందరు బట్టల వ్యాపారం వైపు కూడా అడుగులేశారు. అందుకే ప్రొద్దుటూరు అనగానే టక్కున గుర్తొచ్చేది బంగారం, బట్టలు వ్యాపారాలే. సుమారు 100 ఏళ్ల క్రితమే ఇక్కడ 20 మందితో మొదలైన బంగారం వ్యాపారం ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందినదని జిల్లా పెద్దలు చెబుతుంటారు. ప్రొద్దుటూరులో సుమారు 12 వేల మందికిపైగా స్వర్ణకారులు పసిడి రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెబుతుంటారు. అలా.. ఏళ్లు గడిచే కొద్దీ పసిడి వ్యాపారంలో ప్రొద్దుటూరు పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ మార్మోగింది. అందుకే ఏపీకి చుట్టుపక్కలున్న రాష్ట్రాల ప్రజలు ఇక్కడికొచ్చి లక్షలు, కోట్ల రూపాయిల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే.. కొందరు అక్రమంగా గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారన్న పక్కా సమాచారం ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. తిరిగి మళ్లీ సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి మరి.

Gold-12.jpg

Updated Date - 2023-10-22T18:57:50+05:30 IST