KTR: లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది
ABN , First Publish Date - 2023-10-13T20:40:24+05:30 IST
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) భద్రతపై టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు.

హైదరాబాద్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) భద్రతపై టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు.
"ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరం. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయాల్లో ఇది దురదృష్టకరం. లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలను. రాజకీయాలు వేరైనా ఆయన కుటుంబం బాధను నేను అర్ధం చేసుకోగలను. వారికి నా సానుభూతి. నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై మేము కూడా చాలా ఆందోళన చెందాం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో ఏలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేసుకోగలను. హైదరాబాద్ శాంత భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ అందోళన చేయడం వద్దు అన్నాను. రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయాలలోకి తెలంగాణను లాగవద్దు అన్నాను." అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.