Kodi Kathi Case: కోడికత్తి కేసులో దర్యాప్తు అధికారిపై ఎన్ఐఏ కోర్ట్ అసహనం.. కారణం ఇదే...
ABN , First Publish Date - 2023-03-07T19:41:20+05:30 IST
సాక్ష్యం చెప్పడానికి సాక్షులను తీసుకొస్తున్నారు. కేసుకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురారా? ఈ విషయం దర్యాప్తు అధికారి(ఐవో)కు తెలియదా? అసలు కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా
విజయవాడ: ‘‘సాక్ష్యం చెప్పడానికి సాక్షులను తీసుకొస్తున్నారు. కేసుకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురారా? ఈ విషయం దర్యాప్తు అధికారి(ఐవో)కు తెలియదా? అసలు కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా’’ అని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు (NIA Court) ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy)పై కోతికత్తి (Kodi Kathi)తో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ ఎన్‌ఐఏ కోర్టులో జరిగింది. విచారణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయనే కావడంతో విచారించారు. దినేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి విచారించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోడికత్తితోపాటు పర్సు, బెల్టు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని దినేష్‌కుమార్ వివరించారు. వాటిని చూపించమని న్యాయమూర్తి అడిగినప్పుడు తీసుకురాలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరం జరిగిన తర్వాత సీజ్ చేసిన వస్తువులను కోర్టు అడిగినప్పుడు చూపించాలి కదా అని అడిగారు. సాక్షులను విచారిస్తున్నప్పుడు వాటిని తీసుకురావల్సిన బాధ్యత ఐవోపై లేదా అని ప్రశ్నించారు. అనంతరం కేసును ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఆ సమయంలో సీజ్ చేసిన వస్తువులను కోర్టుకు చూపించాలని ఆదేశించారు.