Bopparaju: ఈ ప్రభుత్వంలో ఏ ఉద్యోగీ ఆనందంగా లేరు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2023-04-08T20:41:26+05:30 IST

ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగీ ఆనందంగా లేరని, జీతాల పెంపు కోసం ఉద్యమించిన రోజులు పోయి ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు

Bopparaju: ఈ ప్రభుత్వంలో ఏ ఉద్యోగీ ఆనందంగా లేరు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

విజయవాడ: ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగీ ఆనందంగా లేరని, జీతాల పెంపు కోసం ఉద్యమించిన రోజులు పోయి ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు ఇమ్మని ఉద్యమించాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు నల్ల కండువాలు ధరించి తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ సీఆర్డీఏ (AP CRDA) కార్యాలయం సమీపంలోని విజయవాడ (Vijayawada) రెవెన్యూ భవన్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అన్ని విభాగాల ఉద్యోగులు నల్లకండువాలు వేసుకుని, డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బొప్పరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఉద్యోగుల ఇబ్బందులు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమంలో ఉద్యోగులంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయకపోతే చివరికి నష్టపోయేది ఉద్యోగులేనని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులే పోరాటాలు చేయాలని, ఇతరులపై నమ్మకం పెట్టుకోవద్దని ఆయన సూచించారు.

ఉద్యమ కార్యాచరణలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం దిగివచ్చేలా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు జీతాల పెంపుదల కోసం ఉద్యోగులు ఉద్యమాలు చేసేవారని, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇమ్మని ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించిందన్నారు. ఉద్యోగులు మౌనంగా ఉంటే రానున్న కాలంలో ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఉద్యమ కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులు డిమాండ్ల పోస్టర్లు చేతబూని అన్ని నగరాల్లో, పట్టణాల్లో నల్లకండువాలు వేసుకుని నిరసన ప్రదర్శన చేశారని తెలిపారు.

Updated Date - 2023-04-08T20:41:26+05:30 IST