Chandrababu: మహానాడు వేదికగా ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-05-25T15:45:07+05:30 IST
మహానాడు వేదికగా ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు (NTR Centenary Celebrations) జరుపుతామని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు.
అమరావతి: మహానాడు వేదికగా ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు (NTR Centenary Celebrations) జరుపుతామని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధుల సభకు ఆహ్వానాలు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవన్ని ప్రపంచానికి ఎన్టీఆర్ చాటి చెప్పారని, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గణాత్మక మార్పులకు ఎన్టీఆర్ నాంది పలికారని చంద్రబాబు వెల్లడించారు.
రాజమండ్రి(వేమగిరి) మహానాడులో అన్ని అంశాలపై చర్చలు జరుపుతామన్నారు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దామని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై చర్చిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మే 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ముస్తాబవుతోంది. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ వేదిక ఇప్పటికే సిద్ధమైంది. ఇక్కడ ఏసీ హాల్‌ను కూడా సిద్ధం చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లూ దాదాపు కొలిక్కి వస్తున్నాయి. పసుపు తోరణాలతో రాజమహేంద్రవరం వీధులను పసుపుమయం చేస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే ఇక్కడ బస చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామకృష్ణారెడ్డి, గన్నికృష్ణ, ఆదిరెడ్డి వాసు, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలన్నీ పసుపుమయం కావాలని, ప్రతి ఇంటి నుంచి జనం తరలి రావాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎవరికి వారు పసుపు తోరణాలు, ఫెక్సీలు, జెండాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం రూరల్‌లోని పిడింగొయ్య జైహింద్ నగర్లో తెలుగుమహిళలు బుధవారం ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మహానాడుకు ఆహ్వానించారు. మన తెలుగోళ్ల పండుగని, ఇంటిల్లిపాది తరలి రావాలని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి తదితరులు కోరారు. కాగా, మహానాడు కార్యక్రమాలు నిర్వహించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నానికి రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. మంజీరా ఇంటర్నేషనల్ హోటల్లో ఆయన దిగుతారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహిస్తారు.
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాల మీద, ఏర్పాట్ల మీద చర్చిస్తారు. ఆయన మూడు రోజులు రాజమహేంద్రవరంలోనే ఉంటారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో 15 తీర్మానాలపై చర్చ జరుగనుంది. 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. వేదిక మీద చంద్రబాబుతోపాటు పొలిట్‌బ్యూరోసభ్యులు, పార్టీ ముఖ్యనేతలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ ఇన్చార్జిలు ఆశీనులవుతారు. వేదిక మీద సుమారు 300 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో తీర్మానంపై కనీసం ఇద్దరు చొప్పున సుమారు 50 మంది వరకూ మాట్లాడే అవకాశం ఉంది.
ఏర్పాట్లు పూర్తి: అచ్చెన్న
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనెల 27వ తేదీన జరిగే ప్రతినిధుల సభ ప్రాంగణాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మహానాడు నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అందుకోసం డీజీపీకి లేఖ రాశామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ అభిమానులు మహానాడుకు వచ్చే విధంగా ఆర్టీసీ బస్సులు కావాలని ఆర్టీసీ ఎండీకి లేఖ రాశామని, ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు.