ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి కన్నుమూత

ABN , First Publish Date - 2023-03-04T03:13:53+05:30 IST

ప్రముఖ రచయిత్రి, తొలితరం పాత్రికేయురాలు, ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి.. కూచి రామలక్ష్మి (93) ఇకలేరు. వయోభారం, ఆరోగ్యసమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి కన్నుమూత

ఆరుద్ర సతీమణి.. ఆయన రచనలకు తొలి విమర్శకురాలు

జీవనజ్యోతి, చిన్నారి పాపలు తదితర చిత్రాలకు కథా రచన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి, తొలితరం పాత్రికేయురాలు, ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి.. కూచి రామలక్ష్మి (93) ఇకలేరు. వయోభారం, ఆరోగ్యసమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ, సాహిత్య రంగాలకు కె.రామలక్ష్మిగా సుపరిచితురాలైన ఆమె ‘జీవన జ్యోతి’, ‘చిన్నారి పాపలు’ తదితర సినిమాలకు కథ, మాటలు అందించారు. రామలక్ష్మి రాసిన ఓ కథ ఆధారంగానే ‘గోరింటాకు’ సినిమా తీశారు. రామలక్ష్మి స్వస్థలం.. కాకినాడ దగ్గర కోట నందూరు. 1930 డిసెంబరు 31న జన్మించారు. ఆమె తండ్రి కూచి అచ్యుత రామయ్య భాషా పండితుడు, సాహిత్యాభిలాషి. ఆ రోజుల్లోనే ఆయన రామలక్ష్మిని బి.ఎ.పట్టభద్రురాలిని చేశారు. రామలక్ష్మి.. మద్రాస్‌ స్టెల్లా మేరీస్‌ మహిళా కళాశాల డిగ్రీ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. సీనియర్‌ జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ప్రోత్సహంతో ‘తెలుగు స్వతంత్ర’ పత్రిక ఆంగ్ల విభాగంలో సబ్‌-ఎడిటర్‌గా పని చేశారు. అప్పుడే ఆరుద్ర, శ్రీశ్రీ వంటి సాహితీ వేత్తలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆరుద్ర, రామలక్ష్మి వివాహం 1954లో జరిగింది.

ఆరుద్ర సాహిత్యానికి తొలి విమర్శకురాలు ఆమే. ఆయన పరిశోధన గ్రంథాలు ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ రచనలో రామలక్ష్మి పాత్ర ప్రముఖంగా ఉందని సాహితీలోకం అభిప్రాయం. రామలక్ష్మి ఆంధ్ర పత్రికలో చాలా కాలం ‘ప్రశ్నావళి’ శీర్షిక ద్వారా పాఠకుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవారు. సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగానూ చాలాకాలం ఉన్నారు. కొన్నాళ్ల కిందట సీనియర్‌ జర్నలిస్టు తెలకపల్లి రవికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలువురు సినీ ప్రముఖులపై రామలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రచయిత్రిగా ఆమె అనేక కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశారు. తెలుగు సాహిత్య రంగంలోని కవులు, రచయితల దాంపత్య జీవితాలను ప్రస్తావిస్తూ ‘వెలసిపోయిన దాంపత్యం’ పేరుతో పుస్తకం రాశారు. విడదీసే రైలు బళ్లు , మెరుపుతీగ, అవతలి గట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై, ఆంధ్ర నాయకుడు ..ఇలా 15కు పైగా నవలలు రాశారు. రామలక్ష్మి ఆరుద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండవ అమ్మాయి కవయిత్రి రౌద్రి కొన్నేళ్ల కిందట కన్నుమూశారు. చిన్నకుమార్తె త్రివేణి అమెరికాలో స్థిరపడ్డారు. ఆచార, సంప్రదాయాలకు అతీతంగా ఆరుద్ర అంత్యక్రియలను రామలక్ష్మి ఎంత నిరాడంబరంగా నిర్వహించారో.. అదే పద్ధతిలో ఆమె అంత్యక్రియలను కూడా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సంజీవరెడ్డినగర్‌లోని విద్యుత్‌ దహన వాటికలో జరిపినట్లు కుమార్తె కవిత తెలిపారు.

Updated Date - 2023-03-04T03:13:53+05:30 IST