Share News

Nara Lokesh: ఏపీలో పారిశ్రామిక నవశకం

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:22 AM

అశోక్‌ లేల్యాండ్‌ ప్రారంభంతో ఏపీలో పారిశ్రామిక నవశకం ప్రారంభమైందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంస్థ ప్రారంభం కావటం రాష్ట్ర పారిశ్రామికరంగ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు.

Nara Lokesh: ఏపీలో పారిశ్రామిక నవశకం

  • అశోక్‌ లేల్యాండ్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

  • వైసీపీ పాలనలో పారిశ్రామికరంగం దెబ్బతింది

  • పలు సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి

  • చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఏపీ బ్రాండ్‌

  • పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పిస్తున్నాం

  • వ్యాపార అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాం

  • ప్రభుత్వంపై నమ్మకంతో 7 లక్షల కోట్ల పెట్టుబడులు

  • ఎస్ర్కో ద్వారా ప్రోత్సాహకాలు నేరుగా జమ: లోకేశ్‌

విజయవాడ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): అశోక్‌ లేల్యాండ్‌ ప్రారంభంతో ఏపీలో పారిశ్రామిక నవశకం ప్రారంభమైందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంస్థ ప్రారంభం కావటం రాష్ట్ర పారిశ్రామికరంగ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడ మల్లవల్లిలో అశోక్‌ లేల్యాండ్‌ బస్‌ బాడీ ప్లాంట్‌ను బుధవారం లోకేశ్‌ ప్రారంభించారు. అంతకుముందు ఆ కంపెనీ తయారు చేసిన డబుల్‌ డెక్కర్‌ బస్సులో ప్లాంటును సందర్శించారు. ఆవరణలో మొక్క నాటారు. రిబ్బన్‌ కట్‌ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్‌ లేల్యాండ్‌ తయారు చేసిన ఎంఎ్‌సఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేశ్‌ మాట్లాడారు. ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లిలో 1,360 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండస్ర్టియల్‌ పార్క్‌ను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. టీడీపీ ప్రభుత్వం 450కు పైగా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వేధింపుల కారణంగా చాలావరకు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఆ పాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్‌ లేల్యాండ్‌ కూడా ఒక టి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరైన అమరరాజా, లులు వంటి భారీ పెట్టుబడిదారీ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి. జాకీ వంటి కంపెనీలు కూడా పొరుగు రాష్ర్టాలకు వెళ్లిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో మళ్లీ ఏపీకి ‘బ్రాండ్‌’ వచ్చింది. అశోక్‌ లేల్యాండ్‌ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావటం గొప్పగా భావిస్తున్నా. పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినపుడు అశోక్‌ లేల్యాండ్‌ను తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చాను. ఆ ఎన్నికల హామీ నెరవేరినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు.


4,800 బస్సుల తయారీ సామర్థ్యం

ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చామని లోకేశ్‌ గుర్తుచేశారు. ‘రాష్ర్టానికి కొత్త పెట్టుబడుదారులను ఆహ్వానించే ముందు వారిలో విశ్వాసాన్ని కలిగించే చర్యలు చేపడుతున్నాం. ఈ ప్లాంట్‌ అశోక్‌ లేల్యాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. కేటాయించిన 75 ఎకరాల్లో మొదటి ఫేజులో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్థి చేశారు. ఈ ప్లాంట్‌కు ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొదటిదశలో 600 ఉద్యోగాలు వచ్చాయి. రెండో దశలో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలలో విశ్వాసాన్ని పునరుద్థరించడంపై దృష్టి సారించాం. ఫలితంగా ఆర్సెలర్‌ మిట్టల్‌, టాటా పవర్‌ వంటి ప్రధాన సంస్థలు రూ.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పైన, మా ప్రభుత్వ నాయకత్వంపైనా నమ్మకం ఉంచినందుకు అశోక్‌ లేల్యాండ్‌, హిందూజా గ్రూప్‌ అధినేతలు అశోక్‌ హిందూజా, ధీరజ్‌ హిందూజా, సోమ్‌ హిందూజా, షేను అగర్వాల్‌, గణేశ్‌ మణి, స్విచ్‌ మొబిలిటీకి చెందిన మహేష్‌ బాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇకపై పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎస్ర్కో ఎకౌంట్‌ ద్వారా నేరుగా జమ చేస్తాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్‌, కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, ఎండీ అభిషిక్త్‌, ఆర్‌టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్‌ హిందూజా, ధీరజ్‌ హిందూజా, ఎండీ షేనూ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 03:22 AM