Global Investors Summit 2023: ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కేంద్రం ఏర్పాటు: ముఖేశ్ అంబానీ
ABN , First Publish Date - 2023-03-03T21:28:13+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లతో అతి పెద్ద డిజిటల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. ఇది పూర్తయితే రాష్ట్రంలో 98 శాతం కవర్ అవుతుందని..
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లతో అతి పెద్ద డిజిటల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. ఇది పూర్తయితే రాష్ట్రంలో 98 శాతం కవర్ అవుతుందని, మారుమూల గ్రామాలకు జియో సేవలు అందుతాయని వెల్లడించారు. ఏపీలో అపార ఆర్థిక వనరులు ఉన్నాయని గుర్తించి పెట్టుబడులు పెట్టిన తొలి కార్పొరేట్ కంపెనీ తమదేనని గుర్తుచేశారు. కేజీ బేసీన్ (KG Basin)లో ఆయిల్, గ్యాస్ వెలికితీతకు రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించామని, అతి పెద్ద గ్యాస్ పైపులైన్ నిర్మించామన్నారు. దేశంలో 30 శాతం ఆయిల్, గ్యాస్ అవసరాలను రిలయన్స్ (Reliance) తీరుస్తున్నదన్నారు. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గొప్ప గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నారని, తన కంపెనీలో కూడా ఏపీకి చెందిన వ్యక్తులు పలువురు ఉత్తమ మేనేజర్లుగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సదస్సు సందర్భంగా ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నామని ముఖేశ్ అంబానీ ప్రకటించారు.