టీడీపీలో విజయోత్సాహం
ABN , First Publish Date - 2023-03-24T00:25:53+05:30 IST
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట, పలాస, సారవకోట, పాతపట్నం, హిరమండలం, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేసి.. బాణసంచా కాల్చారు.

- ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో గెలుపుపై సంబరాలు
- జగన్ రెడ్డీ.. నీ పనైపోయింది..
- క్యాంపు రాజకీయాలను వైసీపీ నేతలే ఛీకొట్టారు
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
శ్రీకాకుళం, మార్చి 23(ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట, పలాస, సారవకోట, పాతపట్నం, హిరమండలం, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేసి.. బాణసంచా కాల్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో ఆరంభమైన విజయయాత్ర.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీకి చరమగీతం పాడనున్నట్టు వెల్లడించారు. ‘జగన్ రెడ్డీ.. నీ పనైపోయింది.. క్యాంపు రాజకీయాలను వైసీపీ నేతలే ఛీకొట్టారు’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. జిల్లా కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, రవికుమార్ కేక్‌లు కట్ చేశారు. మిఠాయిలు తినిపించుకుంటూ బాణసంచా కాల్చి ‘జై టీడీపీ... బైబై వైసీపీ’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో కూన రవికుమార్ మాట్లాడారు. ‘‘గ్ర్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్ అని జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఫోర్లు, సిక్సర్లతో ఏకంగా వైసీపీని బౌండరీ బయట నిలబెట్టేసి చెడుగుడు ఆడారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనంటూ ప్రగల్భాలు పలికారు. గెలుపుపై నమ్మకం లేక ప్రత్యేక శిబిరాలు కూడా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలను సైతం ప్రలోభాలకు గురిచేశారు. ఓ ఎమ్మెల్యేని ఏకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో రప్పించి మరీ ఓటు వేయించారు. ఇన్ని చేసినా సీఎంకు దిక్కులేకుండా పోయింది. వైసీపీ ఎమ్మెల్యేలే నిన్ను నమ్మం ‘జగన్’ అంటూ టీడీపీకి జైకొట్టారు. శాసనమండలిని రద్దు చేయాలని బిల్లు పెట్టి, వద్దన్న వారిని బూతులు తిట్టిన జగన్‌కు.. అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందా.? బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు పంచుతు న్నామంటూ హడావిడి చేసినా.. అవినీతి, దుబారా, దోపిడీని ప్రజలంతా గుర్తించేసి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీని ఛీత్కరించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ డీబీటీలో జగన్‌రెడ్డి చేస్తున్న దోపిడీ తేటతెల్లమైంది. 151 సీట్లు.. సింగిల్ సింహం, వైనాట్ 175 అంటూ ఎంతగా అరిచి గీపెట్టినా, ప్రచారం చేసినా బైబై జగన్ అంటూ మొన్న పట్టభద్రులు, నేడు ఎమ్మెల్యేలు తరిమి కొట్టారు. చివరకు సొంత నియోజకవర్గం పులివెందులలోనూ గ్రాడ్యుయేట్లు చుక్కలు చూపించారు. కుప్పంతో పాటుగా పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీదే అని నిరూపితమైంది. రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్న వారంతా టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తుగ్లక్ పాలనకు తెరదించబోతున్నారు.’’ అని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, తోణంగి వెంకన్నయాదవ్, ఎం.కృష్ణమూర్తినాయుడు, జామి భీమశంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.