Batchula Arjunudu: బచ్చుల అర్జునుడు రాజకీయ ప్రస్థానం ఇదే...
ABN , First Publish Date - 2023-03-02T20:22:22+05:30 IST
శాసన మండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత బచ్చుల అర్జునుడు (Batchula Arjunudu)(66) గురువారం మృతిచెందారు. ఆయనకు జనవరి 28వ తేదీన గుండెపోటు..
విజయవాడ: శాసన మండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత బచ్చుల అర్జునుడు (Batchula Arjunudu)(66) గురువారం మృతిచెందారు. ఆయనకు జనవరి 28వ తేదీన గుండెపోటు (Heart Attack) రావడంతో విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం బందరుకోటలో 1957 జూలై నాలుగున సుబ్బయ్య, అచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లలో అర్జునుడు ఆరోవాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 1995నుంచి 2000వరకు బందరుకోట పీఎసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కేడీసీసీబీ వైస్‌చైర్మన్‌గా వ్యవహరించారు. టీడీపీ తరుపున 2000 సంవత్సరం నుంచి 2005 వరకు మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ (Machilipatnam Municipal Chairman)గా పనిచేశారు. 2014 నుంచి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2020వ సంవత్సరం వరకు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2020లో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. రెండేళ్లక్రితం గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పార్టీ నియమించింది. ఇక్కడ పార్టీ వ్యవహారాలను చూస్తుండగానే అర్జునుడికి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ఆయనను పరామర్శించారు. అర్జునుడు మృతికి పార్టీ నాయకులు దిగ్ర్భాంతి చెందారు.