'Vande Bharat': నేడే ‘వందే భారత్’ ప్రారంభం
ABN , First Publish Date - 2023-01-15T03:43:20+05:30 IST
విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడవనున్న వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధరలను రైల్వే శాఖ ప్రకటించింది.

సికింద్రాబాద్‌లో వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ
రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు
ఆదివారం ఈ రైలుకు సెలవు
వచ్చేటప్పుడో రేటు.. వెళ్లేటప్పుడు మరో రేటు
టికెట్ ధరలు ఖరారు చేసిన రైల్వేశాఖ
విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడవనున్న వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధరలను రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఎగ్జిక్యూటివ్ క్లాస్(ఈసీ) టికెట్ ధర రూ.3,170, చైర్‌కార్ టికెట్ ధర రూ.1,720గా నిర్ణయించింది. అలాగే, సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120, చైర్‌కార్ రూ.1,665 గా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఈ వివరాలను రైల్వేశాఖ శనివారం వెల్లడించింది. సంక్రాంతి పండుగ నాడు(ఆదివారం) ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలో మాత్రమే స్టాపులు ఉండగా, తొలిరోజు ప్రజలు కొత్త రైలును తిలకిస్తారన్న ఉద్దేశంతో 21 స్టేషన్లలో కొద్దిసేపు నిలుపుదల చేస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. సోమవారం(ఈనెల 16) నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు ఉంటాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు వందే భారత్ రైలు నడుస్తుందని అధికారులు వెల్లడించారు.
14 ఏసీ చైర్‌కార్(సీసీ) కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్(ఈసీ) కోచ్‌లు కలిపి మొత్తం 16 కోచ్‌లు దీనిలో ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చు. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఈసీ టికెట్ ధర రూ.3,170గా నిర్ణయించగా, ఇందులో బేస్‌ఫేర్ రూ.2,485 రిజర్వేషన్ చార్జి రూ.60, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జి రూ.75, జీఎ్‌సటీ రూ.131, కేటరింగ్ చార్జి రూ.419గా ఉన్నాయి. చైర్‌కార్ టికెట్ ధర రూ.1,720గా నిర్ణయించగా, ఇందులో బేస్‌ఫేర్ రూ.1,206, రిజర్వేషన్ చార్జి రూ.40, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జి రూ.45, జీఎస్టీ రూ.65, కేటరింగ్ చార్జి రూ.364గా నిర్ణయించారు. ఈ రెండు తరగతుల్లోనూ కేటరింగ్ చార్జిని ప్రయాణికుల ఐచ్ఛికానికి వదిలేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రయాణంలో ధరలు కొంచం తక్కువగా ఉన్నాయి. చైర్‌కార్‌కు రూ.1,665, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.3,120గా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 7.55 గంటలకు రాజమండ్రి, 10.00 గంటలకు విజయవాడ, 11.00 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్, మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్, 5.45 గంటలకు ఖమ్మం, రాత్రి 7.00 గంటలకు విజయవాడ, 8.58 గంటలకు రాజమండ్రి, రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
రాజమండ్రిలో రెండు నిమిషాలు, విజయవాడలో ఐదు, ఖమ్మం, వరంగల్‌లలో ఒక్కో నిమిషం చొప్పున ఆగుతుంది. ఇతర రైళ్లలో విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రయాణానికి 11 గంటల నుంచి 13 గంటల సమయం పడుతుండగా, వందే భారత్ రైలులో 8.30 గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు. వందే భారత్ రైలు గరిష్ఠ వేగం గంటకు రూ.160 కి.మీ అయినప్పటికీ ఈ మార్గంలో మాత్రం 80 నుంచి 90 కి.మీ. వేగంతో నడుపనున్నారు. విశాఖ నుంచి బయలుదేరే రైలుకు 20833 నంబరు, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలుకు 20834 నంబరు కేటాయించారు.
టికెట్ల ధరలు ఇవీ..
సికింద్రాబాద్ నుంచి..
చైర్‌కార్ ఎగ్జిక్యూటివ్ క్లాస్
వరంగల్ 520 1,005
ఖమ్మం 750 1,460
విజయవాడ 905 1,775
రాజమండ్రి 1,365 2,485
విశాఖపట్నం 1,665 3,120
విశాఖప్నటం నుంచి...
చైర్‌కార్ ఎగ్జిక్యూటివ్ క్లాస్
రాజమండ్రి 625 1,215
విజయవాడ 960 1,825
ఖమ్మం 1,115 2,130
వరంగల్ 1,310 2,540
సికింద్రాబాద్ 1,720 3,170