వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు.. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లను

ABN , First Publish Date - 2023-02-11T16:53:46+05:30 IST

భీమవరం (Bhimavaram)లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిర్వహించిన ఓ సమావేశంలో

వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు.. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లను

ఏలూరు: భీమవరం (Bhimavaram)లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆర్‌కేఆర్ కాలేజీ విద్యార్థిని రాజధానిపై వెంకయ్యను ప్రశ్నించింది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతి (Amaravati)పై తన అభిప్రాయం ముందే చెప్పానని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని తెలిపారు. అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని గుర్తుచేశారు. విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా.. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో సీఎం జగన్ (CM Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటిదాకా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మాత్రమే జగన్‌ చెబుతూ వచ్చారు. వైజాగ్‌(Vizag)కు రాజధాని తరలిపోతుందని మాత్రం తొలిసారి గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహక భేటీలోనే ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో కొద్దిరోజులుగా రాష్ట్రం రాజకీయంగానూ.. పాలనాపరంగానూ సెగలు కక్కుతోంది. అయితే, సుప్రీం కోర్టు (Supreme Court)లో రాజధాని అంశం ఉందని.. ఈ సమయంలో సీఎం చేసిన వ్యాఖ్య లు కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందంటూ న్యాయనిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో ఆయన వైజాగ్‌కు రాజధాని తరలివెళ్లడంపై స్పష్టతనిస్తారని భావించారు. కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పైనా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావించారు. కానీ.. ఆ రెండు అంశాల ప్రస్తావన లేకుండానే కేబినెట్‌ సమావేశం కొనసాగించారు. కాగా, సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన మంత్రి బొత్స వద్ద ఈ అంశాలను మీడియా ప్రస్తావించింది. విశాఖకు రాజధానిపై కేబినెట్‌లో చర్చించారా అని ప్రశ్నించగా, రాజధాని విశాఖకు తరలింపు అంశం చర్చకు రాలేదని.. ఎవరైనా చెప్పినా కూడా దీనిపై నమ్మవద్దు అని బొత్స సమాధానమిచ్చారు. కేబినెట్‌లో అజెండాలోని అంశాలపై చర్చకే పరిమితం అయ్యామని బొత్స వెంట ఉన్న ఇతర మంత్రులు తెలిపారు.

3 రాజధానులపై మమ్మల్నేమీ అడగలేదు

మూడు రాజధానులను ఏర్పాటుచేసే విషయంలో జగన్‌ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో చేసిన ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 కింద ఏపీకి నూతన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ కమిటీ నివేదికను తదుపరి చర్యలకోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-11T16:53:47+05:30 IST