డ్వాక్రా సంఘాల రికార్డులు ఆడిట్
ABN , First Publish Date - 2023-12-09T00:42:08+05:30 IST
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో నకిలీ స్వయం సహాయక సంఘాల ముసుగులో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి జిల్లాలో మహిళా సంఘాల (డ్వాక్రా) బ్యాంకు ఖాతాల తనిఖీలకు ఆదేశించారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో రూ.2.1 కోట్లు స్వయం సహాయక సంఘం పేరుతో నకిలీ సంఘాన్ని సృష్టించి బ్యాంకు లింకేజీ రుణాలను కొంతమంది పక్కదారి పట్టించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

డీఆర్‌డీఏ ’వెలుగు’లోకి రాని అక్రమాలపై శోధన
ప్రతి మండలానికి నలుగురు ఉద్యోగులతో ఒక బృందం ఏర్పాటు
స్వయం సహాయక సంఘాల రికార్డులు, బ్యాంకు ఖాతాలు పరిశీలన
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో నకిలీ స్వయం సహాయక సంఘాల ముసుగులో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి జిల్లాలో మహిళా సంఘాల (డ్వాక్రా) బ్యాంకు ఖాతాల తనిఖీలకు ఆదేశించారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో రూ.2.1 కోట్లు స్వయం సహాయక సంఘం పేరుతో నకిలీ సంఘాన్ని సృష్టించి బ్యాంకు లింకేజీ రుణాలను కొంతమంది పక్కదారి పట్టించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపించిన అధికారులు సత్యనారాయణపురంలో స్వయం సహాయక సంఘంలో నిధులు పక్కదారి పట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు లోన్ యాప్ ఆపరేటర్, గ్రామైక సంఘం అధ్యక్షురాలు, డీఆర్‌డీఏ దిగువ స్థాయి సిబ్బంది ప్రమేయంతో ఈ అక్రమాలు జరిగినట్టు రుజువైంది. బాధ్యులైన వీఓ, సీసీలను ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇటువంటి అక్రమాలు ఇంకెక్కడైనా జరిగాయా అనే కోణంలో అధికారులు ఆడిట్ జరుపుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 39,671 స్వయం సహాయక సంఘాలకు చెందిన నగదు లావాదేవీల రికార్డులను ఆడిట్ చేయాలని నిర్ణయించారు. ఆడిట్ విభాగం అధికారులతోపాటు డీఆర్‌డీఏ ఉద్యోగులను ఈ బృందంలో సభ్యులుగా నియమించారు. ఒక మండలానికి చెందిన ఉద్యోగులు మరొక మండలంలో ఆడిట్ చేస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉద్యోగులు వున్నారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుతోపాటు ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, స్త్రీనిధి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గ్రామైక సంఘాల ద్వారా సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఎంత మొత్తాలు జమ అయ్యాయి, ఏ పథకం కింద ఏ బ్యాంకుకు నిధులు జమ అయ్యాయనే వివరాలతోపాటు అన్ని రకాల బ్యాంకు లావాదేవీలను ఆడిట్ బృందాలు తనిఖీ చేయనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆడిట్ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు.
ఇంటి దొంగల ప్రమేయంతోనే....
డీఆర్‌డీఏ, వెలుగు విభాగంలో పనిచేస్తున్న కొంతమంది దిగువస్థాయి ఉద్యోగులు, బ్యాంకర్లు ఏకమై స్వయం సహాయక సంఘాల పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో వెలుగులోకి వచ్చిన అక్రమాల ఉదంతంతో జిల్లాలో ఇంకెక్కడైనా ఇటువంటి అక్రమాలు జరిగాయా అనేది గుర్తించి చర్యలు చేపట్టడమే ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశమని పేరు చెప్పేందుకు ఇష్టపడని డీఆర్‌డీఏ అధికారి ఒకరు తెలిపారు.