రియాక్టరే పేలింది
ABN , First Publish Date - 2023-07-04T01:38:30+05:30 IST
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఆర్థిక మండలిలోని సాహితీ ఫార్మాలో వేపర్ కాలమ్ (ఆవిరి స్తంభం) ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
‘సాహితీ’ ఫార్మాలో ప్రమాదంపై అధికారుల అంచనా
డైమిథైల్ సల్ఫాక్సైడ్ సాల్వెంట్‌ను శుద్ధి చేస్తూ కంటెయినర్‌లోకి పంపుతుండగా ప్రమాదం
పైపుల్లో సమస్య తలెత్తడంతో రియాక్టర్‌లో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు
అందుకే పేలుడు
ఆ ధాటికి పక్కనున్న కంపెనీలో పడిన రియాక్టర్
నిపుణులైన సిబ్బంది లేకపోవడమే కారణం
పది లక్షల లీటర్ల సాల్వెంట్స్ అగ్గిపాలు
వారం రోజుల్లో నివేదిక తయారీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఆర్థిక మండలిలోని సాహితీ ఫార్మాలో వేపర్ కాలమ్ (ఆవిరి స్తంభం) ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. సాల్వెంట్‌ను కంటెయినర్‌లోకి పంపుతుండగా గత నెల 30వ తేదీ (శుక్రవారం) ఉదయం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అదేరోజు ఇద్దరు కార్మికులు మృతిచెందగా, ఆదివారం ఒకరు, సోమవారం మరొకరు మరణించారు. దాంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్లే ప్రమాదం జరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలని అధికారులు యత్నించగా, ఆ ప్రమాద స్థలంలో ఉన్నవారిలో కొందరు చనిపోయారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లభించిన ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఏమి జరిగి ఉంటుందో అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
సాల్వెంట్ శుద్ధి ప్రక్రియలో ప్రమాదం
వివిధ పరిశ్రమల్లో వినియోగించిన పలు రకాల సాల్వెంట్లను సాహితీ ఫార్మాకు తీసుకువచ్చి, వాటిని శుద్ధి చేసి తిరిగి వెనక్కి పంపుతుంది. ఇలా తీసుకువచ్చే సాల్వెంట్లలో ప్రమాదకరమైన వ్యర్థాలు ఏమైనా ఉన్నాయా?...అని పరీక్షించాలి. దీనికి ప్రత్యేకంగా ఒక లేబొరేటరీ ఉండాలి. సాల్వెంట్లలో తేమ, నీరు, పెరాక్సైడ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడాలి. కానీ ఇక్కడ నామమాత్రంగా లేబొరేటరీని నిర్వహిస్తున్నారు. కేవలం తేమ, నీరు మాత్రమే పరీక్షించి సాల్వెంట్లను శుద్ధి చేస్తున్నారు. ప్రమాదకరమైన పెరాక్సైడ్ల గురించి ఎటువంటి పరీక్షలు చేయడం లేదు. అది ప్రధాన లోపంగా అధికారులు గుర్తించారు. డైమిథైల్ సల్ఫాక్సైడ్ (డీఎంఎస్‌ఓ) సాల్వెంట్‌ని శుద్ధి చేస్తూ కంటెయినర్‌లోకి పంపుతుండగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఏమి జరిగిందంటే...?
సాల్వెంట్లలో వ్యర్థాలను తొలగించి, శుద్ధి చేయడానికి వాటిని వేడి చేస్తారు. సాహితీ ఫార్మాలో తక్కువ ఉష్ణోగ్రత వద్దే వేడి చేయడానికి ‘వాక్యూమ్ డిస్టిలేషన్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ ప్రక్రియ మధ్యలో విద్యుత్ సరఫరా ఆగిపోయినట్టయితే దానికి అనుసంధానం చేసిన రియాక్టర్‌లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఒకవేళ అందులో పెరాక్సైడ్లు ఏమైనా ఉంటే పేలుడు సంభవిస్తుంది. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి విద్యుత్ సరఫరా ఆగిపోగానే ఆటోమేటిక్‌గా జనరేటర్ ఆన్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అదేవిధంగా పైపుల్లో ఏమి జరుగుతున్నదో అర్థం చేసుకునే పరిజ్ఞానం కలిగిన సిబ్బంది ఉండాలి. కానీ ఇక్కడ పదో తరగతి, ఇంటర్ చదివినవారు పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. డీఎంఎస్‌ఓని శుద్ధి చేస్తున్నప్పుడు వాక్యూమ్ కాలమ్‌లో సమస్య ఏర్పడి...దానికి అనుసంధానం చేసిన ఐదో నంబరు రియాక్టర్‌లో ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక రియాక్టర్ పేలింది. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అధికారులు ఈ విషయం గ్రహించారు. ఆ రియాక్టర్ బరువు దాదాపు ఐదు టన్నులు. దాని సామర్థ్యం 8 కిలోలీటర్లు. పేలుడు వల్ల అది ఎగిరి 70 మీటర్ల దూరానున్న మరో కంపెనీలో పడింది. వాక్యూమ్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా ఆగినప్పుడు తక్షణమే తదనుగుణంగా కటాఫ్ చర్యలు చేపట్టాలి. ఇక్కడ పనిచేస్తున్న వారికి ఆ పరిజ్ఞానం లేకపోవడంతో ప్రమాదం పెద్దదైంది. సుమారు పది లక్షల లీటర్ల సాల్వెంట్లు మండిపోయాయి. అందుకనే మంటలు ఒకంతట అదుపులోకి రాలేదు. భారీ ప్రమాదం జరిగింది. మంటల వల్ల భవనాలన్నీ పటుత్వాన్ని కోల్పోయాయి.
స్పార్క్ వచ్చిందని యాజమాన్యం వాదన
అధికారులు గుర్తించినది ఒకటి కాగా యాజమాన్య ప్రతినిధులు మరో వాదన వినిపిస్తున్నారు. ఒక వైపు డీఎంఎస్‌ఓ కంటెయినర్‌లోకి లోడింగ్ అవుతుండగా అదే ఆవరణలో మరోవైపు ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను లోడింగ్ చేస్తున్నామని అక్కడ ‘స్పార్క్’ వచ్చిందని, దాంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ స్పార్క్ రావడానికి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు కారణమని అంటున్నారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.
తొలుత స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల కూడా స్పార్క్ వస్తుందని, ఆ విధంగా సాల్వెంట్‌లో మంటలు వచ్చి ఉంటాయని నిపుణులు భావించారు. అయితే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తరువాత సాల్వెంట్‌ను పైనుంచి పోయకుండా ఒక పైపు ద్వారా కనెక్ట్ చేసి పంపించారని, దానివల్ల అక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి అవకాశం లేదని గుర్తించామని వివరించారు.
వారం రోజుల్లో నివేదిక...‘సాహితీ’కి నోటీసులు
సురేశ్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
సాహితీ ఫార్మాలో అన్నీ పరిశీలించాం. ఇన్‌పుట్ రికార్డు, స్టేట్‌మెంట్లు తీసుకున్నాం. లభించిన సమాచారం ఆధారంగా నివేదిక తయారుచేస్తున్నాం. వారం రోజుల్లో అందజేస్తాం. అయితే సాహితీ ఫార్మాలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి అవకాశం లేదు. ఆ నిర్మాణాలు బలహీనమైపోయాయి. సాహితీ యాజమాన్యానికి నోటీసు ఇస్తున్నాం. మళ్లీ నిర్మాణం పూర్తిచేసుకుంటే పరిశీలించి ఉత్పత్తికి అనుమతి ఇస్తాం.