మారని ఆర్జేడీ కార్యాలయం తీరు!
ABN , First Publish Date - 2023-10-06T01:17:50+05:30 IST
పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అవినీతిపై ఏడాది క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

ఏడాది క్రితమే మంత్రి హెచ్చరిక
అయినా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, రెన్యువల్ సమయంలో చేతివాటం
నగరంలో ఓ పాఠశాలకు అనుమతులపై అనుమానాలు
ఆర్జేడీ నిరాకరించినా ఫైలును క్లియర్ చేసిన ఇద్దరు ఉద్యోగులు
నాలుగు పాఠశాలలు ఫేక్ ఫైర్ సర్టిఫికెట్లు సమర్పించాయనే వాదన తెరపైకి...
మరి డీఈవో కార్యాలయం ఏం చేస్తున్నట్టని ప్రశ్నలు
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అవినీతిపై ఏడాది క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కార్యాలయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని మందలించారు. పాలనా పరంగా నిక్కచ్చిగా ఉంటూ ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని ఆర్జేడీ జ్యోతికుమారిని మంత్రి ఆదేశించారు. ఆ తరువాత విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా ఆర్జేడీని అప్రమత్తం చేశారు. అయినా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారని తాజాగా మరోసారి ఫిర్యాదు వెళ్లడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే సూపరింటెండెంట్ ఆనంద రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఏడాది క్రితం మంత్రి హెచ్చరించినప్పుడే ఆర్జేడీ అప్రమత్తమై ఉంటే...ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆర్జేడీకి తెలియకుండా నగరంలో ఒక ప్రముఖ పాఠశాల గుర్తింపునకు కార్యా లయంలో ఇద్దరు వ్యక్తులు అనుమతి పత్రం ఇచ్చారని వెలుగులోకి వచ్చింది. నగరంలో ఒక ప్రముఖ పాఠశాలకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు జిల్లా విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. తొమ్మిది, పది తరగతులకు అనుమతి ఇచ్చేందుకు కొన్ని పత్రాలు సమర్పించాలని ఆర్జేడీ ఆదే శించారు. అయినా పాఠశాల యాజమాన్యం వాటిని సమర్పించకపోవడంతో అనుమతికి నిరాకరిస్తూ ఆర్జేడీ ఫైలు పెండింగ్‌లో పెట్టేశారు. అయితే కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు సదరు పాఠశాల యాజమాన్యం నుంచి భారీగా సొమ్ములు తీసుకుని అనుమతి ఇచ్చారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా మూడు రోజుల క్రితం ఆరోపణలపై కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగిని సరండర్ చేసినా కొందరు ఉద్యోగుల తీరులో మార్పులేదని ఆరోపణలు వస్తున్నాయి. గడచిన రెండు రోజుల్లో కూడా కొన్ని పాఠశాలలకు అనుమతులు జారీ చేసేందుకు సొమ్ములు తీసుకున్నారని ప్రచారం సాగుతుంది.
కాగా నగరంలో నాలుగు పాఠశాలలు ఫేక్ ఫైర్ సర్టిఫికెట్లు పెట్టిన విషయం గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫైలు పంపడంతో లంచాలు తీసుకున్నట్టు తమపై మంత్రికి ఫిర్యాదు చేశారని కార్యాలయంలో కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు. నాలుగు పాఠశాలలు తప్పుడు సర్టిఫికెట్లు పెడితే...అసలు వాటిపై డీఈవో ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా 9, 10 తర గతులకు సంబంధించి అనుమతి కోసం డీఈవో కార్యాలయం నుంచి ఆర్జేడీ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళతాయి. అటువంటప్పుడు నాలుగు పాఠశాలలు సమర్పించిన ఫైర్ సర్టిఫికెట్లు నకిలీవని డీఈవో కార్యాలయం ఎందుకు గుర్తించ లేదు? లేక గుర్తించినా...సొమ్ములు తీసుకుని ఆర్జేడీకి ప్రతి పాదనలు పంపారా?...అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లపై సదరు పాఠశాలకు ఇంతవరకు డీఈవో నోటీసులు జారీచేయలేదని తెలిసింది. ఆర్జేడీ, డీఈవో కార్యాలయాల మధ్య సమన్వయం లేకపోవడంతో నాలుగు పాఠశాలలకు నోటీసులు జారీని పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది.