CM Jagan : మోదీ వెంటే మనం!
ABN , First Publish Date - 2023-07-29T03:52:45+05:30 IST
ఒకవైపు అవిశ్వాస తీర్మానం! మరోవైపు... బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఢిల్లీ బిల్లు’.. ఈ రెండు కీలక అంశాల విషయంలో మోదీ సర్కారుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విపక్షాలన్నీ ముక్తకంఠంతో
వైసీపీ ఎంపీలకు జగన్ స్పష్టీకరణ
ఢిల్లీ బిల్లు, అవిశ్వాసంపై సర్కారుకు సంపూర్ణ సహకారం
ఎంపీలంతా హాజరు కావాలని ఆదేశం
వచ్చేవారం సభలో కీలక పరిణామాలు
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు అవిశ్వాస తీర్మానం! మరోవైపు... బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఢిల్లీ బిల్లు’.. ఈ రెండు కీలక అంశాల విషయంలో మోదీ సర్కారుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ‘ఢిల్లీ సర్వీసు’లకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో వచ్చే వారమే బిల్లు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చేపట్టేదీ వచ్చేవారమే స్పీకర్ నిర్ణయించే అవకాశముంది. దీంతో ఆగస్టు మొదటి వారం పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ రెండు అంశాల్లో వైసీపీ ఎంపీలు మోదీ సర్కారుకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోదరుడు అవినాశ్ రెడ్డిపై కేసు, తన అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణతోపాటు.. అప్పులు, ఆర్థికంగా కేంద్ర సహకారం జగన్‌కు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండాలని... ఉభయ సభల్లో మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. నిజానికి బీజేపీకి లోక్‌సభలో వైసీపీ మద్దతు అంత అవసరం లేదు. అయినా సరే... ఎంపీలంతా సభకు హాజరు కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక... ఢిల్లీ బిల్లు గట్టెక్కేలా రాజ్యసభలో తమ 9 మంది సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని జగన్ ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాత్రం అవిశ్వాసంపై జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం ఆ పార్టీ ఎంపీలు బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. అమర్‌నాథ్ గౌడ్ హత్యలో రాజకీయ కారణాలు లేవని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని వివరించారు. దేశంలో 75కోట్ల మంది బీసీలు ఉండగా... కేంద్రం బడ్జెట్‌లో వారికి కేవలం రూ.14లక్షల కోట్లు కేటాయించడం దారుణమని బీద మస్తాన్ రావు విమర్శించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.