అప్రకటిత విద్యుత్‌ కోతలు.. ఆక్వా రైతుల అవస్థలు

ABN , First Publish Date - 2023-05-18T00:16:40+05:30 IST

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా గంటల తరబడి విద్యుత్‌ కోతలతో వనామి రొయ్యల చెరువుల్లో తిరిగే ఏరియేటర్లు నిలిచిపోయి చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు నీటిపై తేలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలు.. ఆక్వా రైతుల అవస్థలు
అద్దె జనరేటరు

కలిదిండి, మే 17 : అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా గంటల తరబడి విద్యుత్‌ కోతలతో వనామి రొయ్యల చెరువుల్లో తిరిగే ఏరియేటర్లు నిలిచిపోయి చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు నీటిపై తేలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రొయ్యలు మృత్యువాత పడి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతుందన్నారు. ఎకరానికి రూ.2 లక్షలు పైగా పెట్టుబడి పెట్టామని విద్యుత్‌ కోతల కారణంగా సాగు చేతికి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అద్దె జనరేటర్లను తీసుకొచ్చి వాటి ద్వారా చెరువుల్లో ఏరియేటర్లను తిప్పుతున్నారు. గంటకు జనరేటర్‌ అద్దె రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. డీజిల్‌ ఖర్చు రైతులే భరించాలి. గంటకు 15 లీటర్లు డీజిల్‌ ఖర్చు అవుతుంది. జనరేటర్లకు డిమాండ్‌ పెరగడంతో అద్దె పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. రేయింబవళ్లు చెరువుల వద్ద కాపలాలు కాస్తూ ఆయిలింజన్లతో నీటిని రీ సైక్లింగ్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా అప్రకటిత విద్యుత్‌ కోతల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

రొయ్యల సాగుకు తీవ్ర నష్టం

అప్రకటిత విద్యుత్‌ కోతతో రొయ్యల సాగుకు నష్టం వాటిల్లుతోంది. గంటల తరబడి విద్యుత్‌ కోత విధించడంతో ఏరియేటర్లు నిలిచి చెరువుల్లో ఆక్సిజన్‌ కొరతతో రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లు తోంది.

– నల్లగోపుల చలపతిరావు, ఆక్వా రైతు

విద్యుత్‌ కోతలు ఎత్తేయాలి

అప్రకటిత విద్యుత్‌ కోతలతో అద్దె జనరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. గంటకు రూ.600 అద్దె వసూలు చేస్తున్నారు. డీజిల్‌కు గంటకు రూ.1500 చొప్పున ఖర్చవుతోంది. ఏ క్షణంలో విద్యుత్‌ కోత విధిస్తున్నారో తెలియడం లేదు. అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తేయాలి.

– డి.భోగేశ్వరరావు, ఆక్వా రైతు

Updated Date - 2023-05-18T00:16:40+05:30 IST