అమ్మకు కడుపుకోత !
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:56 AM
జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలవడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది.

నూటికి 70 మందికి సిజేరియన్లు వైద్యుల కాసుల కక్కుర్తే కారణమా ?
ఆపరేషన్లలో పశ్చిమ మూడో స్థానం.. ఆరోగ్య శాఖ మంత్రి ఆగ్రహం
అత్యధికంగా చేసిన 42 ఆసుపత్రులకు వివరణ కోరుతూ షోకాజ్
ఆసుపత్రుల తనిఖీలకు కమిటీ ఏర్పాటు.. 60 శాతానికి తగ్గింపునకు కృషి
జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలవడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కాసుల కక్కుర్తితో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కత్తెర్లకు పనిచెబుతూ అమ్మ జీవితాన్ని నరకంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే సిజేరియన్ ఆపరేషన్‌లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. వైద్యులు జాతీయ వైద్య మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
భీమవరం టౌన్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గర్భవతికి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. కాని, కాసుల కక్కుర్తితో కొందరు వైద్యులు అవసరం లేకపోయినా సిజేరియన్‌లు చేయిస్తున్నారు. ఇందుకు ఆయా ఆసుపత్రుల గణాంకాలే చెబుతున్నాయి. ఈ విషయంలో మన జిల్లా గత ఏడాది రెండో స్థానంలో ఉండగా, ఈ ఏడాది కాస్త తగ్గి మూడో స్థానానికి చేరింది. పైనుంచి వచ్చిన ఒత్తిడితోనే వైద్యా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇది తగ్గింది. అయినప్పటికీ ఇది ఇంకా తగ్గాల్సి వుంది. సాధారణంగా జిల్లాలో ఏడాదికి 18 వేల నుంచి 20 వేల వరకు ప్రసవాలు జరుగున్నా యి. వీటిలో 12 నుంచి 13 వేల వరకు ప్రైవేటు ఆసుపత్రు ల్లోను, ఆరు నుంచి ఏడు వేల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోను జరుగుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు సిజేరియన్లే కావడం ఆందోళన కలిగించే విషయం. కొన్ని పీహెచ్‌సీల్లో 97 శాతం నమోదు కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది గట్టిగా ప్రయత్నించడంతో 70 నుంచి రెండు శాతానికి తగ్గి 68 శాతానికి తగ్గింది. దీనిని 60 శాతానికి తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోను ఆపరేషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జిల్లా వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచంట పీహెచ్‌సీలో 97 శాతం సిజేరియన్‌లు జరగ్గా కేవలం మూడు శాతమే నార్మల్ డెలివరీలు జరిగినట్లు నివేదికలు ఉండటంతో ఆడిట్ బృందం తనిఖీ చేపట్టింది.
అత్యధిక సిజేరియన్లు ఆ ఆసుపత్రుల్లోనే..
జిల్లాలో 120 ప్రైవేట్ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల ద్వారా ప్రసవాలు చేసేందుకు అనుమతి వుంది. ఇందులో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్‌లు చేస్తున్న 42 ఆసుపత్రులను గుర్తించారు. ‘సాధారణ డెలివరీలు చేయకుండా ఎందుకు సిజేరియన్లు చేశారు ? కారణాలు ఏమిటి ? మిగిలిన ఆసుపత్రులతో పోలిస్తే మీ వద్దే ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది’ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీచేశారు. అలాగే ఇందులో టాప్ 5 ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎక్కువగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్(డీఐవో), గైనకాలజిస్టు, మత్తు వైద్యులు ఉంటారు. వీరు ఆసుపత్రులకు వెళ్లి రికార్డులను పరిశీలించి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తారు. జిల్లాలో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడు తున్నట్లు డీఎంహెచ్‌వో గీతాబాయి తెలిపారు. ఎక్కువ ఆపరేషన్‌లు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆపరేషన్లు ఎప్పుడు చేయాలి ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) మార్గదర్శ కాల ప్రకారం.. ప్రసవాల్లో పది నుంచి 15 శాతం మాత్రమే సిజేరియన్లు ఉండాలని నిర్దేశించింది. కాని, ఆ మార్గదర్శకాలు ఇక్కడ అమలు కావడం లేదు.
శిశువు అడ్డం తిరగడం, గుండె సంబంధిత తదితర అత్యవసర సమయాల్లో మాత్రమే శస్త్ర చికిత్సలు చేయాలి.
తల్లీబిడ్డల ఆరోగ్యాలపై ప్రభావం
సిజేరియన్ ఆపరేషన్‌ల కారణంగా అటు తల్లితోపాటు ఇటు బిడ్డల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతోంది.
శిశువు పుట్టిన వెంటనే తల్లి ముర్రు పాలు ఇవ్వాలి. ఇది సాధారణ ప్రసవాల్లో సాధ్యమవుతోంది. సిజేరియన్ వల్ల తల్లి నిద్ర మత్తులో ఉంటుంది కాబట్టి బిడ్డకు పాలు ఇవ్వలేదు. కాబట్టి వారిలో వ్యాధి నిరోధక శక్త తగ్గి అనారోగ్యం పాలయ్యే అవకాశం వుంది.
అకారణంగా సిజేరియన్లు
నెలలు నిండిన తర్వాత బిడ్డకు జన్మనివ్వడం పాత పద్ధతి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టించుకుని మరీ ప్రసవం చేయించే వారు పెరిగిపోవడంతో ఆపరేషన్లు తప్పడం లేదు.
పురిటినొప్పులు తట్టుకోలేమనే భావనతో చాలా మంది ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
నార్మల్ డెలివరీకంటే సిజేరియన్ చేస్తే అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని కొందరు కక్కుర్తిపడి వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
జీవన శైలిలో మార్పులే కారణం
మహిళల జీవన శైలిలో మార్పులు వచ్చాయి. వారిలో వ్యాయామం తగ్గడం, సరైన వయసుల్లో వివాహాలు కాకపోవడం, ఆలస్య గర్బధారణ, ఆహార నియమాలు సరిగా పాటించకపోవడం తదితర కారణాలతో ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణ ప్రసవాలకు బదులు సిజేరియన్‌లు చేయాల్సి వస్తోంది. మరోవైపు రిస్క్‌కు అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మంది ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవం జరగాలనే ఆకాంక్ష పెరగడమూ మరో కారణం.
– డాక్టర్ యిర్రింకి లక్ష్మి, గైనకాలజిస్టు, భీమవరం