Gautam Adani: హిండెన్‌బర్గ్ వ్యవహారం నుంచి పుంజుకుంటున్న అదానీ.. మంగళవారం ఒక్కరోజే ఏకంగా...
ABN , First Publish Date - 2023-05-24T16:54:11+05:30 IST
గౌతమ్ అదానీ ఆస్తి విలువ తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా గ్లోబల్ టాప్-20 సంపన్నుల జాబితాలో అదానీ తిరిగి చోటుదక్కించుకున్నారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో ఆయన ఆస్తి విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెంది 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Research report) వ్యవహారం ప్రభావంతో గౌతమ్ అదానీ (Gautham adani) నేతృత్వంలోని అదానీ గ్రూపు (Adani group) కంపెనీల విలువ దారుణంగా పడిపోయింది. కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమవ్వడంతో విలువ అమాంతం పతనమైంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. అయితే తిరిగి క్రమంగా ఆయన ఆస్తి విలువ పుంజుకుంటోంది. తాజాగా గ్లోబల్ టాప్-20 సంపన్నుల జాబితాలో అదానీ తిరిగి చోటుదక్కించుకున్నారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో ఆయన ఆస్తి విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెంది 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో (Bloomberg Billionaires Index) ఆయన 18వ స్థానంలో నిలిచారు.
సెప్టెంబర్ 2022లో ఏకంగా 254 బిలియన్ డాలర్లతో గ్లోబల్ టాప్-2 సంపన్నుడిగా నిలిచిన అదానీ.. హిండెన్‌బర్గ్ వ్యవహారం ప్రభావంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సంపద విలువ భారీగా పతనమైంది. ఈ ప్రభావంతో గ్లోబల్ టాప్-20 బిలియనీర్ల జాబితా నుంచి అదానీ ఔటయ్యారు. అయితే అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు పెట్టుబడుల దిగ్గజం జీక్యూజీ ప్రకటించడం, హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్ట్ క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఈ వారం ర్యాలీ కొనసాగుతోంది. మొత్తం 10 కంపెనీల షేర్లు మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ63,418.85 కోట్ల మేర వృద్ధి చెందాయి. దీంతో కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.10.16 లక్షల కోట్లకు పెరిగింది. అయితే జనవరి 24 కంపెనీ గరిష్ఠ వ్యాల్యూ రూ.19.20 లక్షల కోట్ల కంటే ప్రస్తుత విలువ చాలా తక్కువగానే ఉంది.