పాఠాలు తొలగిస్తే చరిత్ర చెరిగిపోతుందా?
ABN , First Publish Date - 2023-04-11T01:21:40+05:30 IST
చిన్నపిల్లలకు అబద్ధాలు బోధించడాన్ని మించిన మహా పాపం మరేముంటుంది? ‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం– కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని’ చిన్నారుల మనస్సులను ద్వేషం, పగ, ప్రతీకారాలతో నింపడమనేది...

చిన్నపిల్లలకు అబద్ధాలు బోధించడాన్ని మించిన మహా పాపం మరేముంటుంది? ‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం– కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని’ చిన్నారుల మనస్సులను ద్వేషం, పగ, ప్రతీకారాలతో నింపడమనేది పెద్దలు చేసే ఘోరమైన పనులలో కెల్లా ఘోరాతిఘోరమైనది. ఇటువంటి పాపాలు చేసేవారు నరకంలో యమకింకరుల నుంచి ‘ప్రత్యేక మర్యాదలు’ తప్పక పొందుతారట. సుప్రసిద్ధ దౌత్యవేత్త జెఎన్ దీక్షిత్ (1936–2005) ఇస్లామాబాద్‌లో తనకు ఎదురైన ఒక వింత, దిగ్భ్రాంతికరమైన అనుభవాన్ని రెండు దశాబ్దాల క్రితం నాతో పంచుకున్నారు. భారత్ హై కమిషనర్‌గా ఉన్న కాలంలో మన దేశంతో సత్ససంబంధాలను ప్రగాఢంగా కోరుకునే పాకిస్థానీయులు ఆయన్ను తరచుగా తమ ఇంట విందుకు ఆహ్వానించేవారు. అలా ఒకానొక సాయంత్రం ఒక పాకిస్థానీ గృహంలో ఈయన ఉండగా, ఆ గృహస్థు చిన్నారి కుమార్తె వారి దగ్గరకు వచ్చింది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఈ అంకుల్ భారతీయుడు... అని ఇంకా ఏదో చెప్పక ముందే ఆ పాప వెన్వెంటనే దీక్షిత్ కుర్చీ చుట్టూ తిరుగుతూ పెద్దగా ‘హిందూ కుత్తా, హిందూ కుత్తా’ (హిందూ కుక్క, హిందూ కుక్క) అని పాడడం ప్రారంభించింది. దీక్షిత్ దిగ్భ్రమ చెందాడు. ఈ వింత అనుభవం ఆయన్ని వ్యాకులపరిచింది. అయితే ఆ బాలికను ఆయనేమీ తప్పు పట్టలేదు. ‘భారతీయుల గురించి పాకిస్థానీ బాలలకు నేర్పుతున్నదానినే ఆ చిన్నారి వ్యక్తం చేసింది’ అని దీక్షిత్ నాకు వివరించారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలలో సైతం ‘జాలీమ్’ (పీడకుడు, నియంత, క్రూరుడు) అనే పదాన్ని బొమ్మ రూపేణా బోధించాలంటే ఒక సర్దార్జీ చిత్రాన్ని చూపిస్తారు. హిందువులను కపటులు, జిత్తుల మారివాళ్లు, డబ్బు యావ ఉన్నవాళ్లుగా అభివర్ణిస్తారు. పాకిస్థానీయుల మనస్సుల్లో బనియా అనేది హిందువుకు పర్యాయపదం’.
పాకిస్థాన్ ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్న అస్తవ్యస్త పరిస్థితులకు కారణాలు ఏమిటి? బహుశా, తమ బాలలకు పాకిస్థానీయులు చెప్పిన అబద్ధాలే వాటిని వివరిస్తాయి. విద్వేష భావాలు, కుట్ర సిద్ధాంతాలు, పాకిస్థానేతర విశాల ప్రపంచం, ముఖ్యంగా పొరుగున ఉన్న భారతదేశం వ్యక్తిత్వం, స్వభావాల గురించిన తప్పుడు భావనలను బోధించడం వల్లే పాకిస్థానీ సమాజం ప్రస్తుత దుస్థితిలోకి దిగజారిపోయింది. మన సహనశీల, వైవిధ్యపూరిత, బహుతావాద భారతీయ సమాజంలో పాకిస్థానీ తరహా శోచనీయ పరిణామాలు సంభవించవచ్చని నేను కలలో కూడా ఊహించలేదు. చిన్న పిల్లల మనస్సులను విద్వేష భావాలతో విషపూరితం చేయడమనేది పాకిస్థాన్ లాంటి విఫల రాజ్యాల లక్షణం. మనం, దాని కంటే చాలా చాలా మెరుగ్గా ఉన్నాం, సందేహం లేదు. అయితే ఇటీవల ప్రతీ ప్రత్యూషవేళ నా గృహ పరిసరాల నుంచి గుడిగంటలు, అజాన్ పిలుపులు, గురువాణి ప్రభాతగానం వింటూ నన్ను నేను... నిజంగానే, నిజంగానే మనం మెరుగ్గా ఉన్నామా? మనం చేస్తున్నదీ, చేయదలుచుకున్నదీ, చేయడానికి ఉద్యుక్తమైనది పాకిస్థానీయులు చేసిన దానికంటే భిన్నంగా ఉన్నదా? అని ప్రశ్నించుకోక తప్పడం లేదు.
హిందువులపై కొంతమంది పాకిస్థానీయులు తమ బాలల మనస్సుల్లో విషం నింపినట్టే, మన విద్యారంగం గమనాన్ని నిర్దేశిస్తున్న వారు సైతం దేశ చరిత్ర నుంచి ముస్లింలను తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య గ్రంథాలను తిరిగి రాయడంపై ఇటీవల నెలకొన్న వివాదం, ఆ చర్య వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని సందేహాతీతంగా స్పష్టం చేసింది. భారత్‌కు వాస్తవిక చరిత్రను నిరాకరిస్తూ, ముస్లింలను సంస్కారహీనులు, క్రూరులుగా చిత్రించే ప్రయత్నంలో భాగంగానే పాఠ్యగ్రంథాల పునర్లేఖనానికి పూనుకున్నారు. దురాక్రమణ, దోపిడీకే ముస్లింలు భారత్ పైకి దండెత్తి వచ్చారనే బోధించేందుకు వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ముస్లింలు సమున్నత సంస్కృతీపరులు కారని, ఉదాత్త నాగరికతా విలువలు వారికి తెలియవని చెప్పదలుచుకున్నారు. ముస్లింల పాలన మన దేశ చరిత్రలో ఒక అంధకార యుగమని ఘంటాపథంగా చెప్పదలుచుకున్నారు.
విద్యాబోధనలో ముస్లింలకు ప్రాధాన్యమివ్వకపోవడమనేది ఒక సిద్ధాంత ప్రచారంలో భాగమే. భిన్నత్వంలో ఏకత్వం అనే సత్యాన్ని నిరాకరిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో హిందువులు, ముస్లింలకు సమ ప్రాధాన్యమున్న ఉమ్మడి చరిత్రను గౌరవించేందుకు నిరాకరిస్తున్నారు. తాజ్ మహల్ మహత్వాన్ని చాటి చెప్పేందుకు సైతం నిరాకరిస్తున్నారు. స్మారక కట్టడాల గురించి ఏమైనా చెప్పడం జరిగితే, రాళ్లెత్తిన కూలీల వెతల గురించి ప్రస్తావించేందుకే పరిమితమవుతున్నారు. అసలా అజరామర చారిత్రక, స్మారక కట్టడాలు పూర్తిగా హిందువులవనే వాదన చేస్తున్నారు. ఫతేపూర్ సిక్రీ లాంటి నగరం తొలుత హిందువులదని, మొగల్ చక్రవర్తులు దానిని స్వాయత్తం చేసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. తాజ్ మహల్ తొలుత ఒక హిందూ ఆలయమని అంటున్నారు.
నిజానికి ఇవేమీ కొత్త భావాలు కావు. నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే అంటే 1960వ దశకంలోనే చరిత్రకారుడు పిఎన్ ఓక్ పుస్తకాలు చదివి నవ్వుకునేవాళ్లం. తాజ్ మహల్ తొలుత ఒక హిందూ ఆలయమని ప్రతిపాదించింది ఆయనే. అయితే ఈ సిద్ధాంతాలు 21వ శతాబ్దిలో కూడా ప్రాచుర్యంలో ఉండగలవని మేము ఆనాడు భావించలేదు. అటువంటి సిద్ధాంతాలను ప్రవచించేవారు మతోన్మాదులని భావించే వాళ్లం. దురదృష్టమేమిటంటే అటువంటివారు అప్రధానంగా మిగిలిపోకుండా ప్రధానస్రవంతిగా పరిణమిస్తున్నారు. చరిత్ర పుస్తకాలను తిరగరాసి మొగల్ సామ్రాజ్య కథను పూర్తిగా ఉపేక్షించడం లేదా దాని ప్రాధాన్యాన్ని తగ్గించడమనేది ప్రమాదకరమైన ప్రయత్నం. చరిత్రపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు మీకు హక్కు ఉన్నది. అక్బర్ చక్రవర్తి అందరూ అనుకుంటున్న విధంగా అంత గొప్పవాడు కాకపోవచ్చు. అయితే పిల్లలు ప్రాథమిక చారిత్రక వాస్తవాలు తెలుసుకున్న తరవాత వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళితే బాగుంటుంది. మౌలిక వాస్తవాలను వక్రీకరించినా లేదా పూర్తిగా వదిలివేసినా అక్బర్ నిజంగా గొప్పవాడా, కాదా అనే విషయమై హేతుబద్ధమైన చర్చ ఎలా సాధ్యవుతుంది?
స్వాతంత్ర్యానంతరం దేశ చరిత్ర రచనా బాధ్యతను ‘వామపక్ష చరిత్రకారుల’కు అప్పగించారు, వారు తమ మార్క్సిస్టు భావజాల ప్రభావంతో చరిత్ర రాశారన్న వాదనతో నేను తగాదాపడను. దేశ విభజన, దాని పర్యవసానంగా సంభవించిన మతోన్మాద అల్లర్లు, రక్తపాతం అనంతరం చరిత్రను రాస్తూ హిందువులు– ముస్లింల మధ్య శత్రుత్వాన్ని తగ్గించి చూపారని, మతోన్మాదం మళ్లీ ప్రకోపించకుండా ఉండేందుకే అలా చరిత్ర రాశారన్న వాదననూ నేను తోసిపుచ్చను. స్వాతంత్ర్యానంతరం దేశచరిత్ర రచనలో కీలక పాత్ర వహించిన వారి దృక్పథానికి ప్రత్యామ్నాయ దృక్పథంతో ఇప్పుడు చరిత్ర రాస్తున్న వారి అభిప్రాయాలను సమర్థించేందుకు కూడా నాకేమీ అభ్యంతరం లేదు అయితే కొన్ని ప్రశ్నలు. ప్రస్తుతం ఒక ప్రత్యామ్నాయ దృక్పథంతో చరిత్ర రాస్తున్నవారు హిందూ–ముస్లిం సంబంధాలకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు? ఈ కొత్త చరిత్ర ‘మంచి హిందువు–చెడ్డ ముస్లిం’ సూత్రాన్నే ఎందుకు అనుసరిస్తోంది? ఈ విధమైన చరిత్ర రచన పాండిత్యమా? ప్రచారమా? అపార వైవిధ్యమున్న చరిత్ర మనది. సింధు నాగరికత కాలం నుంచీ ఈ దేశం ఒక హిందూ రాజ్యంగా ఉన్నదని, ఈ దేశంలో స్థిరపడిన ఇతర మతాల వారందరూ అనాగరికులని తేల్చేందుకు సంప్రదాయ చరిత్రలో మార్పులు చేయడాన్ని నేను అంగీకరించను. హిందూ– ముస్లిం సమైక్యత విషయంలో మహాత్మాగాంధీ ప్రగాఢ విశ్వాసానికి సంబంధించిన రచనా ఖండికలు, వాటిపై హిందూ ఛాందసవాదుల ఆగ్రహావేశాలకు సంబంధించిన వివరణలను సైతం తొలగించారని ఒక జాతీయ దినపత్రిక పేర్కొంది. ఈ లెక్కన మరి కొద్ది సంవత్సరాలలో నాథూరామ్ గాడ్సే మహా దేశభక్తుడని (ఇటువంటి ప్రచారం ఇప్పటికే జరుగుతోంది), నిజానికి ముస్లింలీగే మహాత్ముడిని హతమార్చిందని, ఆ హత్యానేరంలో అమాయకుడైన గాడ్సేను ఇరికించారని చరిత్రను తిరగరాసే అవకాశముందని నేను ఊహిస్తున్నాను.
విద్యారంగంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల పట్ల నేను ఆక్షేపణ తెలుపడానికి చాలా కారణాలు ఉన్నాయి. చదువుకోవడం ద్వారా తమ పిల్లలు సత్యాసత్య విచక్షణ అలవరుచుకుని, జీవితంలో పురోగమించే సామర్థ్యాలతో ఉత్తమ పౌరులుగా ఎదగగలరని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. మరి అబద్ధాలను బోధించడాన్ని ప్రోత్సహిస్తున్న విద్యా విధానం తల్లిదండ్రుల విశ్వాసాన్ని వమ్ము చేయడమే. పాఠ్యాంశాలలో మార్పులు అబద్ధాలు మాత్రమే కాదు, విషపూరితమైన అసత్యాలు. ముస్లింలు మన శత్రువులు; భారతదేశంలో వారికి స్థానం లేదు, ఉండకూడదు; ఈ దేశం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హిందువులదే, హిందూ రాజ్యంగా మాత్రమే అది ఉండాలి; –వీటినే ఎందుకు ఉద్దేశిస్తున్నారు? వికసిస్తున్న బాలల ఆలోచనలను విషతుల్యం చేయడం మానవాళికి వ్యతిరేకంగా ఘోర నేరానికి పాల్పడడమే. ఇక, ఆచరణకు సంబంధించిన మరో కారణం కూడా ఉన్నది: మన దేశ జనాభాలో ముస్లింలు 14శాతం. ఇన్ని కోట్ల మందికి వ్యతిరేకంగా అధిక సంఖ్యాకులలో విద్వేష భావాలను రెచ్చగొడుతూ ఈ సువిశాల దేశ పాలనను ఎలా సమర్థంగా నిర్వహించగలుగుతారు? శాంతి సామరస్యాలను ఎలా కాపాడతారు? ఈ దేశ చరిత్రలో తాము భాగస్వాములంకామని, ఈ దేశ భౌగోళికతలో తాము అంతర్భాగం కాదని ముస్లింలు ఆందోళన చెందరా? వారిలో ఇటువంటి భావం ఏర్పడడం దేశ శ్రేయస్సుకు ఎలా దోహదం చేస్తుంది? ఈ విద్వేషాలు, వైమనస్యతలు అంతర్యుద్ధానికి దారి తీయవూ?
పాకిస్థాన్‌లో మైనారిటీ మత వర్గాలను ద్వేషించడాన్ని బోధించినందునే ఇప్పటికీ ఆ దేశంలో నివసిస్తున్న కొద్ది మంది హిందువులు వివక్షలకు గురవుతున్నారు. అను నిత్యం భయానక పరిస్థితుల నెదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు మన దేశంలో బాలలకు ముస్లింలను ద్వేషించడాన్ని బోధించడం ఎటువంటి పర్యవసానాలకు దారితీయనున్నది? చిన్న పిల్లల మనస్సుల్లోకి ద్వేషపూరిత సిద్ధాంతాలను ఎక్కించడం వల్ల మత, సామాజిక వైవిధ్యం ప్రాతిపదికగావర్ధిల్లుతున్న ఈ జాతి తన మనుగడను కాపాడుకోగలదా? విద్వేషాన్ని బోధిస్తున్న విద్యావేత్తలూ ఆ విషపూరిత బోధనలను ప్రేరేపిస్తున్న పాలకులూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి.
వీర్ సంఘ్వి
(ది ప్రింట్) (సీనియర్ జర్నలిస్టు)