జాబిల్లిలో ‘శివశక్తి’

ABN , First Publish Date - 2023-08-29T03:57:36+05:30 IST

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావడం మన అంతరిక్ష పరిశోధనా చరిత్రలో ఒక అద్భుతమైన విజయం అని చెప్పక తప్పదు...

జాబిల్లిలో ‘శివశక్తి’

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావడం మన అంతరిక్ష పరిశోధనా చరిత్రలో ఒక అద్భుతమైన విజయం అని చెప్పక తప్పదు. ల్యాండర్ విక్రమ్ నుంచి చంద్రుడిపైకి దిగిన రోవర్ ప్రజ్ఞాన్ చందమామ ఉపరితలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడి వాతావరణం, ఉష్ణోగ్రతపై తన నివేదికలను కూడా పంపిస్తోంది. ఇది పరిశోధనకు కొత్త మార్గాల్ని తెరిచింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టిన దేశం భారత్ మాత్రమే కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి అంతరిక్ష నౌక విక్రమ్ మన దేశానిదే కావడం మనకు గర్వకారణం. ఇదే ప్రాంతంలో ప్రవేశించేందుకు కొద్ది రోజుల ముందు రష్యా లూనా ప్రయత్నించి విఫలమైంది. చంద్రయాన్ విజయవంతం అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్ బర్గ్‌లో బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాతో పాటు ప్రపంచ దేశాధినేతలంతా మోదీని అభినందించారు. ఇది బ్రిక్స్ కుటుంబానికే గొప్ప విజయంగా ఆ గ్రూపు దేశాలు అభివర్ణించాయి. బ్రిక్స్ దేశాలన్నీ ఒక అంతరిక్ష సముదాయంగా ఏర్పడాలని మోదీ సూచించారు.

చంద్రయాన్–3 సాధించిన విజయం చూసి మోదీ ఉప్పొంగిపోయారు. దక్షిణాఫ్రికా నుంచే చంద్రయాన్ అపూర్వ దృశ్యాలను చూసి శాస్త్రవేత్తలను అభినందించారు. మువ్వన్నెల పతాకాన్ని చేత ధరించి తాను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తన విదేశీపర్యటన నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకుని ఇస్రో శాస్త్రవేత్తలను, అధికారులను అభినందించారు. శివ భక్తుడైన నరేంద్రమోదీ గుజరాత్‌లోని సోమనాథుడి పేరే ఇస్రో చైర్మన్‌కు ఉండడాన్ని చూసి ఆనందపరవశుడయ్యారు. అంతకు ముందు చైర్మన్ పేరులో కూడా శివుడు ఉండడం యాదృచ్ఛికమో, దైవలీలో నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏమైన ఈ ప్రయోగంలో మహిళా శక్తి ప్రాధాన్యాన్ని కూడా గుర్తించి అంతరిక్ష నౌక విక్రమ్ చంద్రుడిపై అడుగు పెట్టిన ప్రాంతాన్ని నరేంద్రమోదీ ‘శివ శక్తి’ అని నామకరణం చేశారు. ఈ పేరు భారతీయతను సూచిస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్వయంగా చెప్పారు. చంద్రయాన్–2 చంద్రుడిపై మిగిల్చిన పాద ముద్రలను తిరంగగా భావిద్దామని మోదీ చెప్పారు. చంద్రుడిపై మేక్ ఇన్ ఇండియాను తీసుకువెళ్లి అక్కడ భారత పతాక ఎగురవేసిన ఘనత శాస్త్రవేత్తలకే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. ఆగస్టు 23 చంద్రుడిపై దేశం జెండా ఎగురవేసిన రోజు. దాన్ని జాతీయ అంతరిక్ష దినంగా ప్రకటిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అంతర్జాతీయ నేతగా అవతరించే రోజులు సమీపిస్తున్నాయని మోదీ చెప్పారు. 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లకు భారతదేశమే జవాబివ్వగలదని ఆయన అన్నారు. చంద్రయాన్–3 మిషన్‌లో మహిళలు కీలకపాత్ర పోషించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, వారికి కావల్సిన సాధన సంపత్తులను సమకూర్చడం మాత్రమే కాదు, వారి వైఫల్యాలలోనూ, విజయాలను పాలు పంచుకోవడం దేశ నాయకుడి బాధ్యత. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా యువతను, మహిళలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశించి తమ సత్తా చాటవలసిందిగా ఆయన అనేక సందర్భాల్లో వారి భుజం తట్టారు. అంతరిక్ష రంగంలో వినూత్న ప్రతిభను ప్రవేశించేందుకు ఆయన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టారు. చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైనప్పుడు మోదీ అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్‌ను కౌగలించుకుని ఓదార్చారు. ‘కొద్దిలో మన ప్రయోగం విఫలమైంది. వచ్చేసారి మరింత ఆత్మ విశ్వాసంతో ప్రయోగిద్దాం’ అని ఆయన వెన్నుతట్టారు. మోదీ ఇచ్చిన ప్రోత్సాహం అండదండలతోనే నాలుగేళ్లలోనే మరో ప్రయాగం చేసి చంద్రుడిపై విక్రమ్ అడుగుపెట్టేలా మన శాస్త్రవేత్తలు చేయగలిగారు. ‘ఆ రోజు మోదీ నన్ను ఓదార్చి ఇచ్చిన ప్రోత్సాహంతోనే చంద్రయాన్–3ను విజయవంతంగా ప్రయోగించగలిగామ’ని శివన్ స్వయంగా మీడియాకు చెప్పారు. మోదీ ఇచ్చిన స్ఫూర్తి, మద్దతుతో శాస్త్రవేత్తలు తమ కల నెరవేరేందుకు గత నాలుగేళ్లుగా అహోరాత్రులు కృషి చేసినందుకే ఫలితాలు సాధించారని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధ వల్లనే భారతదేశం ఇవాళ తన శాస్త్ర సాంకేతిక శక్తిని ప్రపంచానికి చూపగలిగిందని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మాత్రమేకాదు, శాస్త్రవేత్తలు కూడా ప్రకటించారు. గత ప్రభుత్వాలు చంద్రయాన్‌కు సరైన నిధులు కేటాయించలేదని, ఇస్రోపై కాంగ్రెస్‌కు విశ్వాసమే లేదని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ ఇచ్చినంత ప్రోత్సాహం మరెవరూ ఇవ్వలేదని, ఒక దూరదృష్టి గల ఇలాంటి నాయకుడే మనకు అవసరమని, ఆయన నేతృత్వంలో దేశం అద్భుతాల్ని సాధిస్తుందని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఎఫ్‌బి సింగ్ అన్నారు. మోదీ ప్రసంగం అంతరిక్ష రంగంలో మరింత అంకిత భావంతో పనిచేసేందుకు పురిగొల్పుతోందని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయి అన్నారు. మోదీని కలుసుకోవడం తమనెంతో భావోద్వేగాలకు గురి చేసిందని, అంతరిక్ష రంగంలో నారీ శక్తి ప్రాధాన్యతను మోదీ గుర్తించడం తమను ఉప్పొంగేలా చేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రియాంకా మిశ్రా, సౌజన్య, రీమా ఘోష్ తదితరులు ఎందరో అన్నారు.


దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చంద్రయాన్–3 ప్రయోగ సాఫల్యత ఘనత ప్రధాని మోదీకి లభించడాన్ని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. నెహ్రూ కాలం నుంచే అంతరిక్ష రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం లభించిందని, అందులో మోదీ గొప్పేం లేదని వారు అంటున్నారు. గతంలో అంతరిక్ష పరిశోధన ప్రారంభం కాలేదని ఎవరూ అనలేరు. అయితే కాంగ్రెస్ గతంలోనే చిక్కుకుపోయింది. గతంలో సాధించిన విజయాలకు నెహ్రూ, ఇందిరాగాంధీలు కారణమని వారు చెప్పుకుంటున్నప్పుడు ఈ 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు నరేంద్రమోదీ కారణమని ఎందుకు అంగీకరించకూడదు? ఇస్రో శాస్త్రవేత్తలకే విజయం ఆపాదించాలనే కాంగ్రెస్ నేతలు అదే ఇస్రో శాస్త్రవేత్తలు మోదీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని ప్రశంసించడాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు. అంతరిక్ష పరిశోధనతో సహా వివిధ శాస్త్ర, సాంకేతిక రంగాలలో గత ఏడు దశాబ్దాల్లో సాధించలేని విజయాలను మనం ఈ తొమ్మిదేళ్లలోనే ఎందుకు సాధించగలుగుతున్నాం? ఈ ప్రశ్నకు జవాబు కాంగ్రెస్ నేతలకు తెలిసినా బాహాటంగా చెప్పలేరు మోదీ ఇస్తోన్న ప్రోత్సాహం, ప్రోద్బలం, అందిస్తోన్న నాయకత్వం మూలంగానే అనేక రంగాల్లో భారత్ సత్వర పురోగతి సాధిస్తోందని వారికి బాగా తెలుసు. కుటుంబ పాలన, వ్యవస్థల వైఫల్యం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలతో కూడిన కాంగ్రెస్ పాలనలో శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతవరకు విజయం సాధించాయో ప్రజలకు తెలియదా ఏమిటి?

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-08-29T03:57:36+05:30 IST