Adar Poonawalla: అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయనున్న అదార్ పూనావాలా.. ధరెంతో తెలిస్తే కళ్లు చెదరాల్సిందే!
ABN , First Publish Date - 2023-12-13T19:20:04+05:30 IST
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదార్ పూనావాలా లండన్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సీఎన్‌బీసీ రిపోర్ట్ కన్ఫమ్ చేసింది. మీడియా నివేదికల ప్రకారం..
Adar Poonawalla: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదార్ పూనావాలా లండన్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సీఎన్‌బీసీ రిపోర్ట్ కన్ఫమ్ చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఆ ఇల్లు ఖరీదు రూ. 1,446 కోట్లు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసే ఎస్ఐఐకి సీఈవో అయిన ఈ 42 ఏళ్ల భారతీయ బిలియనీర్.. హైడ్ పార్క్ సమీపంలో దాదాపు శతాబ్దాల నాటి అబెర్‌కాన్‌వే హౌస్ కోసం రూ.1,446 కోట్లు చెల్లించనున్నట్టు తెలిసింది.
రిపోర్ట్స్ ప్రకారం.. ఎస్ఐఐకు చెందిన యూకేలోని అనుబంధ సంస్థ ‘సీరం లైఫ్ సెన్సెస్’ ఈ ఇంటిని కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందంతో.. లండన్‌లో విక్రయించిన రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా అబెర్‌కాన్‌వే హౌస్ నిలిచింది. ఇంతకుముందు 2020 జనవరిలో లండన్‌లో 2-8a రట్‌ల్యాండ్ ఏకంగా £210 మిలియన్లకు విక్రయించబడింది. తొలుత మాజీ సౌదీ అరేబియా యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాజీజ్ దీనిని కొనుగోలు చేశారని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ.. ఇటీవలి కాలంలో ఎవర్‌గ్రాండే వ్యవస్థాపకుడు, చైర్మన్ హుయ్ కా యాన్ అసలు కొనుగోలుదారు అని వెల్లడైంది. దీని తర్వాత లండన్‌లో అత్యంత భారీ ధరకు అమ్ముడైంది.. ఈ అబెర్‌కాన్వే హౌస్.
ఏ ఇతర కంపెనీలకు సాధ్యం కాని రీతిలో.. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం తక్కువ ధరకే టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా అవతరించింది. ఒక ఇంటర్వ్యూలో.. వచ్చే మూడేళ్లలో ఈ సంస్థ యూరోపియన్, అమెరికన్ ప్రయాణికుల కోసం ఎల్లో ఫీవర్, డెంగ్యూ షాట్‌ల ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోందని స్వయంగా అదార్ పూనావాలా తెలిపారు.