Share News

Benjamin Netanyahu: అది సాధ్యం కాదని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఆ పని చేసి తీరుతామంటూ హామీ

ABN , First Publish Date - 2023-11-07T20:39:08+05:30 IST

హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా.. అక్కడి సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు...

Benjamin Netanyahu: అది సాధ్యం కాదని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఆ పని చేసి తీరుతామంటూ హామీ

హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా.. అక్కడి సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు, మహిళలు అన్యాయంగా బలి అవుతున్నారు. ఇప్పటికే సాధారణ ప్రజల మరణాల సంఖ్య 10 వేలు దాటేసింది. దీంతో.. ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని అరబ్ దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలు సైతం అభ్యర్థిస్తున్నాయి. ఇరువర్గాలూ (హమాస్, ఇజ్రాయెల్) కాల్పులను విరమించుకోవాలని కోరుతున్నాయి. కానీ.. కాల్పుల విరమణ సాధ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తాజాగా తేల్చి చెప్పారు.


ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంజిమన్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని, దాడులు కొనసాగిస్తామని చెప్పారు. అయితే.. అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో స్వల్ప విరామాన్ని అమలు చేయవచ్చని అన్నారు. ఈ స్వల్ప విరామంలో రిలీఫ్ మెటీరియల్‌ను గాజాకు అందించవచ్చని తెలిపారు. కానీ.. హమాస్‌పై తమ యుద్ధాన్ని మాత్రం ఆపేది లేదన్నారు. బందీలను విడుదల చేసే వరకు యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు తమ ప్రభుత్వ వైఫల్యమే కారణమని.. ఇందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. ఇలాంటి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ బాధ్యతను తాము నెరవేర్చలేకపోయామని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. గాజా పరిస్థితుల గురించి కూడా బెంజిమన్ నెతన్యాహు మాట్లాడారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రతకు ఇజ్రాయెల్ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ యుద్ధానికి ముందు గాజాను హమాస్ నియంత్రించిందని.. కానీ అక్కడి వాయు, సముద్ర క్షేత్రాలు ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయని తెలిపారు. యుద్ధం ముగిశాక గాజా భద్రత బాధ్యతని తప్పకుండా తీసుకుంటామన్నారు. బెంజిమన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. యుద్ధం అనంతరం గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాగా.. గత నెల రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తోంద. దీంతో.. గాజాలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఆహార కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-07T20:39:10+05:30 IST