New York Sinking: న్యూయార్క్‌పై నాసా సంచలన రిపోర్ట్.. ఈ హాట్‌స్పాట్స్ వేగంగా మునిగిపోతున్నాయి
ABN , First Publish Date - 2023-09-29T19:45:00+05:30 IST
ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో న్యూయార్క్ సిటీ ఒకటి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ నగరాన్ని సందర్శించాలని ఎందరో అనుకుంటారు. అలాంటి నగరం ఇప్పుడు అతిపెద్ద ప్రమాదంలో పడింది..
ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో న్యూయార్క్ సిటీ ఒకటి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ నగరాన్ని సందర్శించాలని ఎందరో అనుకుంటారు. అలాంటి నగరం ఇప్పుడు అతిపెద్ద ప్రమాదంలో పడింది. ఇది క్రమంలో సముద్రంలో మునిగిపోతోంది. తన బరువు తాను మోయలేక ఇది కూరుకుపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ నగరంపై నాసా సంస్థ ఒక సంచలన నివేదిక ఇచ్చింది. న్యూయార్క్‌లోని మూడు హాట్‌స్పాట్స్.. అనుకున్న దానికంటే వేగంగా కూరుకుపోతున్నట్టు ఆ నివేదిక తెలిపింది. అవే.. లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోనీ ఐలాండ్. ఈ మూడు ప్రాంతాలు మొదటగా ప్రభావితం అవుతాయని నాసా వెల్లడించింది.
ఆ మూడు ప్రాంతాలతో పాటు ఫైవ్ బారోగ్స్ (బ్రాంక్స్, బ్రుక్‌లిన్, మాన్‌హటన్, క్వీన్స్, స్టేటెన్ ఐల్యాండ్) కూడా నగరం కన్నా ముందే వేగంగా మునిగిపోతున్నాయని.. ఈ బారోగ్స్ ప్రతి ఏటా 1.6 మిల్లిమీటర్ల చొప్పున కుంగుతోందని రిపోర్ట్ పేర్కొంది. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. 2016 నుండి 2023 వరకు యుఎస్ ఓపెన్ వెన్యూ అయిన ఆర్థర్ ఆషే స్టేడియం, లాగార్డియా విమానాశ్రయంలోని రన్‌వేలు అత్యధికంగా మునిగినట్లు తేలింది. ఇవి సంవత్సరానికి వరుసగా 3.7, 4.6 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతున్నాయి. ఇవి మునుపటి పల్లపు ప్రదేశాలపై నిర్మించబడిన కారణంగా.. అత్యంత వేగంగా మునిగిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా న్యూయార్క్ నగరం మునిగిపోయే ముప్పు మరింత తీవ్రమవుతోంది. అలాగే.. హరికేన్లు, తుఫానుల వల్ల తీరప్రాంతంలో వరదలకు కారణమవుతున్నాయి. 2012లో నగరాన్ని ధ్వంసం చేసిన సూపర్‌స్టార్మ్ శాండీని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తీరప్రాంతంలో ఉన్న జనాభా, ఆస్తులను తీరప్రాంత వరదల నుంచి రక్షించడం న్యూయార్క్‌కి పెద్ద సవాలుగా మారిందని ఆ నివేదిక తెలిపింది. మాన్‌హట్టన్‌ను న్యూజెర్సీని కలుపుతూ.. హాలండ్ టన్నెల్ గుండా వెళుతున్న ఇంటర్‌స్టేట్ 78 కూడా నగరంలోని మిగిలిన ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో మునిగిపోతోందని నాసా తన నివేదికలో జోడించింది.
స్టాటెన్ ఐలాండ్‌లోని గవర్నర్స్ ఐలాండ్, మిడ్‌ల్యాండ్.. సౌత్ బీచ్‌లోని దక్షిణ భాగం.. దక్షిణ క్వీన్స్‌లోని తీర పొరుగున ఉన్న అర్వెర్న్ బై ది సీ కూడా వేగంగా మునిగిపోతున్నట్టు నాసా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే.. న్యూయార్క్ నగరంలోని 1 మిలియన్ భవనాల బరువు 1.7 ట్రిలియన్ పౌండ్లకు దగ్గరగా ఉందని, ఆ బరువు మోయలేక నగరం క్రమంగా కూలిపోతోందని పేర్కొంది. ఆ సర్వే తర్వాత నాసా ఇప్పుడు తాజా రిపోర్ట్‌ని విడుదల చేసింది. పట్టణీకరణ పెరుగుదల, గ్రౌండ్‌వాటర్ పంపింగ్ & డ్రైనేజీలు.. ఈ సమస్యని మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు ఇదివరకే హెచ్చరించారు.
న్యూయార్క్ నగరం వరద ప్రమాదం నుంచి గణనీయమైన సవాళ్లను ఎదుర్కుంటోందని భూవిజ్ఞాన శాస్త్రవేత్త టామ్ పార్సన్స్ మే నెలలోనే ఒక నివేదికని సిద్ధం చేశారు. ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్ తీరం వెంబడి సముద్ర మట్టం పెరుగుదల ప్రపంచ సగటు కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.