Justice Rohit Deo: కోర్టు హాలులోనే రాజీనామా చేసిన జడ్జి.. ఆ కారణాల వల్లే !
ABN , First Publish Date - 2023-08-04T20:10:52+05:30 IST
ముంబై: బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ రోహిత్ డియో శుక్రమవారం కోర్టు హాలులోనే రాజీనామా చేశారు. అప్పటిదాకా వేర్వేరు కేసుల్లో వాదనలు విన్న ఆయన.. ఒక్కసారిగా వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. హాలులో ఉన్నవారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
ముంబై: బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ రోహిత్ డియో శుక్రమవారం కోర్టు హాలులోనే రాజీనామా చేశారు. అప్పటిదాకా వేర్వేరు కేసుల్లో వాదనలు విన్న ఆయన.. ఒక్కసారిగా వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. హాలులో ఉన్నవారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. నాగ్‌పూర్‌లోని బెంచ్ కోర్టు హాలులో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఓ న్యాయవాది తెలిపారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి.. రోహిత్ డియో తన రిసిగ్నేషన్ ఇచ్చినట్లు ఆ న్యాయవాది తెలిపారు. తన రాజీనామా ప్రకటన సమయంలో ఆయన హాలులో ఉన్న వారందరికీ క్షమాపణలు చెప్పినట్టు పేర్కొన్నారు.
‘‘కోర్టులో ఉన్న మీ అందరికీ (న్యాయవాదులు, కోర్టు సిబ్బంది) నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను మీపై ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశాను. అయితే.. మిమ్మల్ని బాధపెట్టాలన్న ఉద్దేశంతో అలా చేయలేదు. మీరంతా బాగుండాలని, మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అలా చేశాను. మీరంతా నా కుటుంబం లాంటివారు. నేను నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేను. అందుకే నా పదవికి రాజీనామా చేశాను. ఈ విషయం చెప్తున్నందుకు మీరంతా నన్ను క్షమించాలి. మీరందరూ కష్టపడి పని చేయాలి’’ అంటూ జస్టిస్ రోహిత్ డియో తన రాజీనామా ఇచ్చిన అనంతరం చెప్పారని ఆ న్యాయవాది చెప్పుకొచ్చారు. అటు.. రోహిత్ డియో బయటకొచ్చిన తర్వాత, వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు ధృవీకరించారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు.
ఇదిలావుండగా.. రోమిత్ డియో తొలుత 2016 వరకు మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పని చేశారు. అనంతరం 2017లో ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 2025 డిసెంబరులో ముగియనుంది. అయితే.. తన పదవీ విరమణకు ఇంకా రెండేళ్లు ఉండగానే, ఆయన తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ.. ఆ వ్యక్తిగత కారణాలు ఏమై ఉంటాయి? అని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు.