Bihar: బిహార్‌లో కులాల లెక్కలు బయటపెట్టిన నితీశ్ సర్కార్.. వివరాలివే
ABN , First Publish Date - 2023-10-02T15:28:29+05:30 IST
లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.
పట్నా: లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది. ఇందుకు సంబంధించిన సర్వే ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వారిలో ఓబీసీ(OBC)లు మొదటి స్థానంలో ఉన్నారు. 13 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో ఓబీసీలు 63 శాతంగా ఉన్నారు. ఎస్సీ(SC)లు 19 శాతం, ఎస్టీ(ST)లు 1.68 శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు(సవర్ణలు) 15.52 శాతంగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలు 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన వారు (EBC) 36 శాతం ఉన్నారు. రాజకీయాలను శాసించే స్థాయిలో ఓబీసీలు ఉన్నారని ఆ సర్వే సారాంశం.
జనాభాలో భూమిహార్లు 2.86 శాతం ఉండగా, బ్రాహ్మణులు 3.66 శాతం, కుర్మీలు (నితీష్ కుమార్ సామాజిక వర్గం) 2.87 శాతం ఉన్నారు. ముసహర్‌లు 3 శాతం, యాదవులు(ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వర్గం) 14 శాతం ఉన్నారు. ఈ సర్వేపై చట్టపరమైన అడ్డంకులు, బీజేపీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న సీఎం నితీశ్ కుమార్, అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ నివేదిక దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. తాజా కుల గణన నివేదికపై ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(Lalu Yadav) స్పందించారు. ఇది చరిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కుల సర్వేలు విడుదల చేసిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఈ సర్వే కీలకమని బిహార్ ప్రభుత్వం పేర్కొంది.