Jacqueliene Fernandez: మనీలాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో జాక్వెలిన్ పరిస్థితేంటి?
ABN , Publish Date - Dec 21 , 2023 | 04:05 PM
కాన్-మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిక్కుకున్న విషయం తెలిసిందే. అతనితో సన్నిహితంగా మెలిగిన పాపానికి.. ఆమెకు ఈ నరకం తప్పట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు...
Jacqueliene Fernandez: కాన్-మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిక్కుకున్న విషయం తెలిసిందే. అతనితో సన్నిహితంగా మెలిగిన పాపానికి.. ఆమెకు ఈ నరకం తప్పట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు హాజరయ్యింది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఈ వ్యవహారం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. శాశ్వతంగా ఈ కేసు నుంచి బయటపడాలని ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌తో పాటు ఈడీ ఛార్జ్ షీట్లను కొట్టివేయాలని కోరింది. ఈ పిటిషన్‌ని గురువారం విచారించిన న్యాయస్థానం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది.
కాగా.. సుకేష్, జాక్వెలిన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణ సమయంలో ఈడీకి తెలియడంతో, రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను సహనిందితురాలిగా చేర్చారు. అంతేకాదు.. ఆమెని పలుమార్లు విచారించడం కూడా జరిగింది. అయితే.. సుకేష్ తనని మోసం చేశాడని, హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకొని తనని తప్పుదారి పట్టించాడని, తనని సంబంధం లేని కేసులో ఇరికించాడని ఆవేదన వ్యక్తం చేసింది. జైల్లో ఉండి కూడా తనతో సుకేశ్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేవాడని కుండబద్దలు కొట్టింది. ఈ కేసు నుంచి విముక్తి పొందాలనే ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసులో ఇప్పటివరకూ దొరికిన సాక్ష్యాల ఆధారంగా తాను అమాయకురాలినని తేలిందని, సుకేశ్ తనని కావాలనే టార్గెట్ చేశాడని రుజువు చేస్తాయని తన పిటిషన్‌లో జాక్వెలిన్ పేర్కొంది.
సుకేశ్ అక్రమంగా సంపాదించిన సంపదను లాండర్ చేయడంలో జాక్వెలిన్‌కి ప్రమేయం ఏమాత్రం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొనబడింది. ఈఓడబ్ల్యూ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఆమెను ప్రెజెంట్ చేసినట్లు ఆ పిటిషన్ తెలిపింది. సుకేష్, జాక్వెలిన్ పరస్పర కలయికలు, సంభాషణల్లో తాను స్వేచ్ఛా వ్యక్తిగానే సుకేష్ చూపించుకున్నాడని.. అతడు జైలులో ఉన్న సంగతి పిటిషనర్‌కి ఏమాత్రం తెలియదని అందులో తెలియజేయబడింది. జైల్లో ఉన్నాడన్న అనుమానం రానివ్వకుండా, సాధారణంగా పలకరించేవాడని, అతని చేతిలో ఆమె మోసపోయిందని ఆ పిటిషన్ స్పష్టం చేసింది.