MCD Polls: ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల రీ-ఎలక్షన్‌పై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2023-02-25T19:40:00+05:30 IST
ఈనెల 27వ తేదీన నిర్వహించదలచిన ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల రీ-ఎలక్షన్‌పై ఢిల్లీ హైకోర్టు శనివారంనాడు స్టే ..
న్యూఢిల్లీ: ఈనెల 27వ తేదీన నిర్వహించదలచిన ఎంసీడీ (MCD) స్టాండింగ్ కమిటీ సభ్యుల రీ-ఎలక్షన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High court) శనివారంనాడు స్టే విధించింది. కొత్తగా ఎన్నికైన మేయర్‌తో సహా సంబంధితులందరికీ జస్టిస్ గౌరంగ్ కాంత్ సారథ్యంలోని ధర్మాసనం నోటీసులు పంపింది. ఫలితాలు ప్రకటించకుండానే రీ-ఎలక్షన్ తేదీని ప్రకటిస్తూ మేయర్ తీసుకున్న నిర్ణయం ప్రాథమికంగా చూసినప్పడు నిబంధనలను ఉల్లంఘనే అమవుతుందని జస్టిస్ గౌరవ్ కాంత్ అన్నారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు.
స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక 27న తిరిగి జరుపుతామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) మున్సిపల్ హౌస్‌లో శుక్రవారంనాడు ప్రకటించిన వెంటనే సభలో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు గొడవకుదిగారు. బాహాబాహీకి దిగారు. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఫలితాలను మేయర్ ప్రకటించడానికి సిద్ధపడుతుండగానే సభలో గలబా చోటుచేసుకుంది. ఒక కౌన్సిలర్ ఏకంగా మేయర్ మైక్‌ను విసిరేశారు.
''స్టాండింగ్ కమిటీ ఫలితాలను ప్రకటిస్తుండగానే వాళ్లు (బీజేపీ కౌన్సిలర్లు) నా కుర్చీని వెనక్కి నెట్టేసి నామీద దాడికి దిగారు. బీజేపీ కౌన్సిలర్లు రవి నెగి, అర్జున్ మర్వా, చంద్రన్ చౌదరి, తదితరులు నా ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశారు'' అని షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. శుక్రవారం వినియోగించిన బాలెట్ పేపర్లు చిరిగిపోవడం, కనిపించకుండా పోవడం జరిగిందని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంసీడీ ప్యానల్‌కు ఆరుగురు సభ్యుల ఎన్నికను మళ్లీ నిర్వహిస్తున్న ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. మేయర్ నిర్ణయంపై బీజేపీ కౌన్సిలర్లు షిఖ రాయ్, కమల్‌జీత్ షెహ్రావత్‌లు హైకోర్టులో పిటిషన్ వేశారు.