Dengue : డెంగీ మహమ్మారి ముప్పు

ABN , First Publish Date - 2023-07-23T01:25:18+05:30 IST

భూతాపం పెరిగిపోతుండటం వల్ల దోమల సంతతి ఎక్కువై ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా హెచ్చరించింది. డెంగీ తీవ్రత ఎక్కువై మహమ్మారి ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది.

 Dengue : డెంగీ మహమ్మారి ముప్పు

  • అమెరికాలో ఇప్పటికే 30 లక్షల పైగా కేసులు

  • గత ఏడాది అన్ని దేశాల్లో వచ్చింది 42 లక్షలు

  • భూ తాపమే కారణమన్న డబ్ల్యూహెచ్‌వో

  • భారత్‌లో ఏటా పెరుగుతున్న జ్వర బాధితులు

  • రాష్ట్రంలో ఈ నెలలో భారీగా కేసుల నమోదు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): భూతాపం పెరిగిపోతుండటం వల్ల దోమల సంతతి ఎక్కువై ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా హెచ్చరించింది. డెంగీ తీవ్రత ఎక్కువై మహమ్మారి ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగిందని పేర్కొంది. 2022లో అన్ని దేశాల్లో కలిపి 42 లక్షల కేసులు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది అమెరికాలో ఇప్పటికే 30 లక్షలకు పైగా డెంగీ పాజిటివ్‌లు నమోదయ్యాయని తెలిపింది. 2019లో 129 దేశాల్లో 52 లక్షల కేసులు వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఉష్ణమండల వ్యాధి డెంగీ అని తెలిపింది. అఽధిక ఉష్ణోగ్రతల వల్ల దోమలు సంతతిని అతి వేగంగా పెంచుకుంటున్నాయని, అదే సమయంలో వాటి శరీరంలోని వైర్‌సను కూడా రెట్టింపు చేసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. డెంగీ సోకిన వారిలో మరణాలు ఒక శాతంలోపే ఉన్నట్లు తెలిపింది.

భారత్‌లో ఏటా పెరుగుతున్న కేసులు..

మన దేశంలో డెంగీ కేసుల పెరుగుదల, ఎంటమాలజిస్టుల కొరతపై కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం శుక్రవారం పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2012లో 32 రాష్ట్రాల్లో 50,222 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఏటా కేసుల పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇక 2016 నుంచి ఏటా దేశవ్యాప్తంగా లక్షకుపైగానే కేసులు వస్తున్నాయి. 2019లో 2,05,243 కేసులొచ్చాయి. 2020లో కొవిడ్‌ కారణంగా డెంగీ తీవ్రత అంతగా కనిపించలేదు. 2021లో 1,93,245 కేసులు, 2022లో 2,33,251 పాజిటివ్‌లు నమోదయ్యాయి. గతేడాది తెలంగాణలో 8,972 డెంగీ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 2.33 లక్షల కేసులొచ్చాయి. పశ్చిమబెంగాల్‌లో దేశంలోనే అత్యధికంగా 67,271 కేసులొచ్చాయి. ఇక 6 రాష్ట్రాల్లో పది వేలకుపైగా డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీల్లో ఎక్కువ కేసులొచ్చాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 58 శాతం కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇక డెంగీ పెరగడానికి ఎంటమాలజిస్టుల కొరత కూడా ఒక కారణంగా తెలిపింది.

రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు..

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 650 డెంగీ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. గత నెల వరకు 100లోపే కేసులుండగా, ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఆగస్టు, సెప్టెంబరులో డెంగీ కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి, నివారణ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో డ్రై డేను చేపట్టింది. డెంగీ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచింది. అలాగే కేసులొచ్చిన చోట నమూనాలు తీస్తోంది. ఫాగింగ్‌ చేస్తున్నారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ప్రజారోగ్య మలేరియా విభాగం అదనపు సంచాలకుడు డాక్టర్‌ అమర్‌సింగ్‌ వెల్లడించారు.

Updated Date - 2023-07-23T01:25:55+05:30 IST