Bharat Gaurav : తొలి భారత్ గౌరవ్ యాత్రికుల రైలు తెలుగు రాష్ట్రాల నుంచి...
ABN , First Publish Date - 2023-03-18T11:19:16+05:30 IST
పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వేలు నడుపుతున్న భారత్ గౌరవ్ యాత్రికుల రైలు తెలుగు రాష్ట్రాల నుంచి
న్యూఢిల్లీ : పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వేలు నడుపుతున్న భారత్ గౌరవ్ యాత్రికుల రైలు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం బయల్దేరుతుంది. పురి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రైలు సికింద్రాబాద్ నుంచి శనివారం బయల్దేరుతుంది. భారత దేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చూపించేందుకు వీలుగా రైల్వే మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ రైళ్ళను ప్రవేశపెట్టింది. ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన పుణ్యక్షేత్రాలు, ప్రదేశాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి.
ఇప్పటి వరకు భారత్ గౌరవ్ రైళ్లు 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 26 ట్రిప్పులు తిరిగాయి. ‘‘పుణ్య క్షేత్ర యాత్ర : పురి-కాశీ-అయోధ్య’’ భారత్ గౌరవ్ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రారంభిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నుంచి నడిచే మొదటి భారత్ గౌరవ్ యాత్రికుల రైలు ఇదేనని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని తూర్పు, ఉత్తరాది ప్రాంతాల్లోని అత్యంత ప్రాచీన, ప్రముఖ ప్రదేశాలను భక్తులు సందర్శించవచ్చునని తెలిపింది. పురి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించవచ్చు. 8 రాత్రులు, 9 పగటి సమయాల్లో ఈ ప్రయాణం సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 9 ముఖ్యమైన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. భక్తులు, ప్రయాణికులు ఈ స్టేషన్లలో ఎక్కవచ్చు, దిగవచ్చు . మొదటి ట్రిప్పులో అన్ని సీట్లు భర్తీ అయిపోయాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
రైలు, రోడ్డు ప్రయాణ సదుపాయాలు ఈ టూర్ ప్యాకేజీలో ఉన్నాయి. అదే విధంగా వసతి సదుపాయాలు, వాష్ అండ్ ఛేంజ్ ఫెసిలిటీస్, కేటరింగ్ ఎరేంజ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఉదయాన్నే టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సదుపాయాలు కూడా ఈ ప్యాకేజీలో భాగమే. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్స్, అన్ని బోగీల్లోనూ సీసీటీవీ కెమెరాలు, అన్ని బోగీల్లోనూ బహిరంగ ప్రకటనలు, ప్రయాణ బీమా, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల నిరంతర సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తారు.
భారత్ గౌరవ్ యాత్రికుల రైలు తదుపరి ట్రిప్ ఏప్రిల్ 18న ప్రారంభమవుతుందని రైల్వేలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్?
India-Bangladesh : భారత్-బంగ్లాదేశ్ మైత్రీ పైప్‌లైన్ విశేషాలు ఎన్నో....!