UN General Assembly : ఉక్రెయిన్‌పై తీర్మానం... భారత్ కీలక నిర్ణయం...
ABN , First Publish Date - 2023-02-24T12:14:24+05:30 IST
ఉక్రెయిన్ (Ukraine)లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనవలసిన అవసరం ఉందని చెప్తున్న ఐక్య రాజ్య సమితి సాధారణ సభ
న్యూయార్క్ : ఉక్రెయిన్ (Ukraine)లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో (UN General Assembly) ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గురువారం గైర్హాజరైంది. ఐరాస చార్టర్‌కు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొనాలని ఈ తీర్మానం పేర్కొంది. ఉక్రెయిన్, ఆ దేశ మద్దతుదారులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఐరాస సాధారణ సభలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. ‘Principles of the Charter of the United Nations underlying a comprehensive, just and lasting peace in Ukraine' పేరుతో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు రాగా.. ప్రతికూలంగా ఏడు ఓట్లు నమోదయ్యాయి. భారత దేశంతో సహా 32 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐరాస చార్టర్‌కు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్ర, శాశ్వత శాంతి నెలకొనడం కోసం ఐరాస సభ్య దేశాలు, అంతర్జాతీయ వ్యవస్థలు తమ దౌత్యపరమైన కృషిని రెట్టింపు చేయాలని ఈ తీర్మానం కోరింది. అంతర్జాతీయ గుర్తింపుగల ఉక్రెయిన్ సరిహద్దుల్లో, భౌగోళిక జలాల్లో ఆ దేశ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతల కోసం కట్టుబడి ఉన్నట్లు ఈ తీర్మానం పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యన్ దళాలను బేషరతుగా, సంపూర్ణంగా, తక్షణమే ఉపసంహరించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. శత్రుత్వాలకు ముగింపు పలకాలని కోరింది.
2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక ఐక్యరాజ్య సమితి తీర్మానాలు ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నాయి. సాధారణ సభ, భద్రతా మండలి, మానవ హక్కుల మండలి వంటి వ్యవస్థలు ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, సమగ్రతలకు మద్దతిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో మన దేశం పాల్గొనడం లేదు. ఐరాస చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతలను ఐరాస చార్టర్ ప్రకారం గౌరవించాలని స్పష్టం చేస్తోంది. తక్షణమే శత్రుత్వాలకు తెరదించాలని, అత్యవసరంగా చర్చలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని చెప్తోంది. దీనికోసం అన్ని విధాలుగా కృషి జరగాలని పిలుపునిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Tomatoes : యూకేలో కొందామంటే దొరకని టమాటాలు... దీని వెనుకున్న అసలు కారణాలివీ...
Saudi Arabia: పండే కదా అని దొంగిలిస్తే!