Hindenburg : హిండెన్‌బర్గ్ నెక్స్‌ట్ టార్గెట్ ఇదే
ABN , First Publish Date - 2023-03-23T20:32:31+05:30 IST
అదానీ గ్రూప్ (Adani Group)ను కష్టాల్లోకి నెట్టిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hidenburg Research) తదుపరి లక్ష్యం జాక్ డోర్సీ
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)ను కష్టాల్లోకి నెట్టిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hidenburg Research) తదుపరి లక్ష్యం జాక్ డోర్సీ (Jack Dorsey) నేతృత్వంలోని పేమెంట్స్ ఫర్మ్ బ్లాక్ ఇంక్ (Block Inc) కాబోతోంది. ఈ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తోంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. రెండేళ్లకుపైగా ఈ సంస్థపై తాము పరిశోధన చేశామని చెప్పింది. డీమోగ్రాఫిక్స్‌ను పద్ధతి ప్రకారం తనకు అనుకూలంగా మలచుకుందని తెలిపింది. ఈ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్‌లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీ, బూటకమేనని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది. ఈ ఖాతాలు మోసపూరితం, ఒకే వ్యక్తికి అనేక ఖాతాలు సృష్టించడం వంటి అక్రమాలు జరిగినట్లు చెప్పారని పేర్కొంది.
ఈ నివేదిక విడుదలైన తర్వాత బ్లాక్ షేర్స్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో 18 శాతం పతనమయ్యాయి. దీనిపై స్పందించాలని మీడియా కోరినప్పటికీ బ్లాక్ ఇంక్ స్పందించలేదు.
ఓర్టెక్స్ డేటా (Ortex data) ప్రకారం, మార్చి 22 నాటికి బ్లాక్ ఫ్రీ ఫ్లోట్ షేర్స్‌లో దాదాపు 5.2 శాతం వరకు షార్ట్ పొజిషన్‌లో ఉన్నాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్స్‌ను విశ్లేషించే ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ఇది. ఈ సంస్థ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూప్ దాదాపు 100 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ అవకతవకలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
Vijay Mallya : విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు