Jayalakshmi: నా తండ్రి శోభన్‌బాబు.. తల్లి జయలలిత.. ఎటువంటి సందేహాలు లేవు.. ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా..
ABN , First Publish Date - 2023-09-16T08:33:02+05:30 IST
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa)కు అసలైన కుమార్తెను తానేనని, ఇందుకోసం అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షకు
- జయ కుమార్తెగా ప్రకటించుకున్న జయలక్ష్మి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa)కు అసలైన కుమార్తెను తానేనని, ఇందుకోసం అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని జె.జయలక్ష్మి(Jayalakshmi) పునరుద్ఘాటించారు. జయ మృతి చెందిన కొత్తలో ఆమె అసలు సంతానం తానేనంటూ మీడియాకు ముందుకు వచ్చిన జయలక్ష్మి.. మళ్లీ ఇన్నాళ్ల తరువాత శుక్రవారం దిండుగల్ జిల్లా కొడైకెనాల్(Kodaikanal)లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. తన తండ్రి ప్రముఖ సినీనటుడు శోభన్‌బాబు(Shobhan Babu) అని తెలిపారు. బయటకు చెప్పుకోలేని వివిధ కారణాల వల్ల జయను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయానని, కానీ ఆమె సీఎంగా వున్నప్పుడు కొన్ని పనులపై రెండుసార్లు కలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓ సారి కలిశానన్నారు.
జయ సినిమాల్లో నటించేప్పుడు మాత్రం తాను పోయెస్ గార్డెన్‌లో నివశించానని, ఆ సమయంలో ఆమె రాసుకున్న డైరీ ఇప్పటికీ తన వద్ద ఉందని తెలిపారు. అంతేగాక జయ ఉపయోగించిన దుస్తులు, వస్తువులు తన వద్ద చాలా ఉన్నాయన్నారు. పలు కారణాల వల్ల తాను జయ కుమార్తెనని అప్పట్లో బహిరంగంగా ప్రకటించలేకపోయానన్నారు. జయ కుమార్తెనని నిరూపించుకునేందుకు తాను డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమని, ఆ వివరాలను కోర్టుకు కూడా సమర్పిస్తానని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ‘అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించానని, మొత్తం 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జయలక్ష్మి పేర్కొన్నారు.