Kaveri waters: కావేరి జలాల వ్యవహారం.. 6న విచారించనున్న సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2023-09-02T07:36:23+05:30 IST
కావేరి నదీజలాల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీ విచారణ చేపడతామని
పెరంబూర్(చెన్నై): కావేరి నదీజలాల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కావేరి జలాల పంపిణీ వ్యవహారంలో కర్ణాటక, తమిళనాడు(Karnataka, Tamil Nadu) రాష్ట్రాల మధ్య దీర్ఘకాలగా సమస్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఒప్పందం ప్రకారం ఆగస్టు నెలకు ఇవ్వాల్సిన నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపిస్తూ గత నెల 14న రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అందులో తమిళనాడు(Tamil Nadu)కు సెకనుకు 10 వేల ఘనపుటడుగుల జలాలు విడుదల చేయాలని కావేరి నిర్వాహక మండలి సిఫారసు చేసిన నేపథ్యంలో, ఆ నీరు సరిపోదని, సెకనుకు 24 వేల ఘనపుటడుగులు అందించాలని రాష్ట్రప్రభుత్వం(State Govt) పిటిషన్‌లో కోరింది.
ఈ పిటిషన్‌ను గత నెల 25వ తేదీ విచారించిన సుప్రీంకోర్టు.. కావేరి నిర్వాహక మండలి సిఫారసుల ప్రకారం నీటిని విడుదల చేశారా లేదా అనే విషయమై నివేదిక దాఖలుచేయాలని మండలిని ఆదేశిస్తూ, తదుపరి విచారణ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణజరగ్గా.. తమకు కొంత సమయం కావాలని కోరిన కర్ణాటక ప్రభుత్వం.. ఈ నెల 11వ తేదీకి వాయిదా వేయాలని కోరింది. అందుకు అభ్యంతరం తెలిపిన రాష్ట్రప్రభుత్వ తరఫు న్యాయవాది 4వ తేది విచారించాలని అభ్యర్థించారు. ఇరుతరఫు అభ్యర్థనల అనంతరం ఈ నెల 6వ తేది కేసు విచారించనున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు.. అప్పటివరకు పాత నిబంధనలే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.