Share News

Lalu Prasad Yadav: ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ అనుచరుడి అరెస్ట్

ABN , First Publish Date - 2023-11-11T11:01:55+05:30 IST

Scam: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌(Tejaswi Yadav)తో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.

Lalu Prasad Yadav: ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ అనుచరుడి అరెస్ట్

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌(Tejaswi Yadav)తో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.అమిత్ కత్యాల్‌కు లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో కత్యాల్ కంపెనీ మనీలాండరింగ్ కు పాల్పడిందని ఈడీ తెలిపింది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి యాంటీ మనీ లాండరింగ్(Moneylaundering) ఏజెన్సీ, సీబీఐ(CBI) దర్యాప్తులు కొనసాగుతున్నాయి. గతంలో కత్యాల్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసిందని, స్పందించకుండా రెండు నెలలుగా తప్పించుకుతిరుగుతున్నారని అధికారులు తెలిపారు. మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ కత్యాల్ కంపెనీలతో పాటు లాలూ యాదవ్, కుమారుడు తేజస్వి యాదవ్,ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపింది. AB ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, AK ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలను ప్రస్తుతం తేజస్వీ యాదవ్ నివాసంగా ఉపయోగిస్తున్నారు. యూపీఏ హయాంలో లాలూ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు.


ఆ టైంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భారీగా భూములు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఈ కేసును సీరియస్ గా తీసుకుని పలువురు ప్రముఖుల్ని విచారిస్తున్నాయి. 2004 నుండి 2009 వరకు, భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మంది గ్రూప్ "డి" ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలు కావాలంటే భూములు ముట్టజెప్పాలని అనడంతో ఉద్యోగ అభ్యర్థులు తమ భూముల్ని లాలూకి, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.

లాలూ గతంలోనూ చాలా కుంభకోణాల్లో దోషిగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ని సీబీఐ ప్రత్యేక కోర్టు గతేడాది దోషిగా ప్రకటించింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 15న తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేసింది. 5 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.60 లక్షల జరిమానా విధించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో దోషిగా తేలిన లాలూ 2013లో జైలు వెళ్లారు.

Updated Date - 2023-11-11T11:06:35+05:30 IST