MS Swaminathan : హరిత విప్లవ జ్యోతి ఆరిపోయింది
ABN , First Publish Date - 2023-09-29T05:58:18+05:30 IST
ఆకలి రక్కసిని అంతమొందించేందుకు నిరంతరం శ్రమించిన ‘భారత హరిత విప్లవ పితామహుడు’ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు.

ఆహార సమృద్ధ భారతదేశ రూపశిల్పి
ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూత
వ్యవసాయానికి తన పరిశోధనలతో పునరుజ్జీవం
1960ల్లో వ్యవసాయం కుదేలు.. వరుస కరువులు
సాగు దెబ్బ తిని సాయానికి విదేశాల వైపు చూపు
గోధుమల విప్లవంతో పరిస్థితిని మార్చేసిన ఎంఎస్
చిరుధాన్యాల సాగుపై ప్రపంచానికి మార్గదర్శకం
పద్మవిభూషణ్, మెగసెసే సహా ఎన్నో గౌరవాలు
రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్ సహా పలువురి సంతాపం
అధికార లాంఛనాలతో రేపు చెన్నైలో అంత్యక్రియలు
చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆకలి రక్కసిని అంతమొందించేందుకు నిరంతరం శ్రమించిన ‘భారత హరిత విప్లవ పితామహుడు’ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతోపాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్.. గురువారం ఉదయం 11.20 గంటలకు చెన్నై తేనాంపేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల యావద్దేశం దిగ్ర్భాంతి చెందింది. స్వామినాథన్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం తరమణిలోని ఎంఎస్ స్వామినాఽథన్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం కూడా భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. విదేశాల్లో వున్న స్వామినాథన్ ఇద్దరు కుమార్తెలు రాగానే శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. స్వామినాథన్ భార్య మీనా గతేడాదే కన్నుమూశారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటి్‌స్టగా, రెండో కుమార్తె మధురా స్వామినాథన్ బెంగుళూరులోని భారత గణాంక శాస్త్ర సాంకేతిక సంస్థలో ఆర్థిక విభా గ ప్రొఫెసర్‌గా, చిన్న కుమార్తె నిత్యా స్వామినాథన్ ఇంగ్లాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
డాక్టరు అవుతారనుకుంటే..
ఎంఎస్ స్వామినాథన్‌గా ప్రపంచానికి చిరపరచితులైన ఆయన పూర్తి పేరు మాన్‌కొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన తమిళనాట ఆలయాల పట్టణంగా పేరుగాంచిన కుంభకోణంలో 1925 ఆగస్టు 7న డాక్టర్ ఎంకే సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ దంపతులకు జన్మించారు. కుంభకోణంలోని కేథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ప్లస్‌టూ వరకు చదివిన ఆయన.. తిరువనంతపురం మహారాజ కళాశాలలో జంతుశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. స్వామినాథన్ తండ్రి వైద్యుడు. స్వామినాథన్ కూడా తనలాగే వైద్యవృత్తిని స్వీకరించి, తన వైద్యశాల బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరుకునేవారు. అప్పట్లో బెంగాల్‌లో ఏర్పడిన విపరీతమైన కరువు పరిస్థితులు స్వామినాథన్‌పై తీవ్ర ప్రభావం చూ పాయి. దాంతో ఆయన దృష్టి వ్యవసాయరంగంపైకి మళ్లింది.
ఎన్నో డిగ్రీలు..
స్వామినాథన్ 11ఏళ్ల వయస్సులో ఉండగానే తండ్రి మృతి చెందారు. ఆ తర్వాత పినతండ్రి సంరక్షణలో ఆయన పెరిగారు. 1940-44లో మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీలో జన్యు పంటల పరిశోధనలకు సంబంధించి ప్రథమశ్రేణిలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. 1948లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. కానీ పోలీసుశాఖలో చేరదలుచుకోలేదు. పలు పరిశోధనా సంస్థల్లో పనిచేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పొందారు. స్వామినాథన్ వందల సంఖ్యలో అక్కడ పరిశోధనా పత్రాలు సమర్పించారు. వ్యవసాయ పరిశోధనలపై అనేక గ్రంథాలు రచించారు. అమెరికాలోని విస్‌కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభించినా వదులుకుని 1954లో స్వదేశానికి తిరిగొచ్చారు. ఒడిశా రాష్ట్రం కటక్‌లోని వ్యవసాయ వర్సిటీలో ఆచార్యునిగా చేశారు.
గోధుమ విప్లవానికి ఆద్యుడు..
1960 దశకంలో దేశంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. భారత్‌లో ఇక తగిన ఆహారోత్పత్తి జరగదని, ప్రజలు ఆకలితో అలమటించి చనిపోవడం ఖాయమని అప్పట్లో ప్రపంచ దేశాలన్నీ భావించాయి. ఆ సందర్భంలోనే స్వామినాథన్ జపాన్‌లో కొత్తగా కనుగొన్న గోధుమ వంగడాన్ని దేశంలో ప్రవేశపెట్టి, అధిక ఉత్పత్తిని, 200 శాతం లాభాలను సాధించేందుకు దోహదపడ్డారు. ఈ విప్లవాన్నే ‘గోధుమల విప్లవం’ అంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వామినాథన్ సేవలను వేనోళ్ల కొనియాడారు. చైనా వరివంగడాలను కూడా దేశంలో ప్రవేశపెట్టి వరిధాన్యాల ఉత్పత్తిని అధికం చేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు ఎంతో కృషి చేశారు. వ్యవసాయ రంగంలో అపారమైన అభివృద్ధిని తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చారు. ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితిని తప్పించి వ్యవసాయోత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దిన ఘనత స్వామినాథన్‌కే దక్కుతుంది. బంగాళాదుంపల ఉత్పత్తిని పెంచడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. స్వామినాథన్ 1980లలో ‘ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్’ను స్థాపించారు.
చిరుధాన్యాలపై పరిశోధనలకు అప్పట్లోనే స్వామినాథన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన ముందుచూపునకు నిదర్శనంగా 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దేశ విదేశాల్లో పేరుగడించిన పరిశోధనాసంస్థల్లో ప్రొఫెసర్‌గా, పరిశోధకుడిగా, విభాగాధిపతిగా ఎన్నో పదవులను స్వామినాథన్ అలంకరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యుడిగా సేవలందించారు. గ్రామీణ ప్రజల అభివృద్ధి, వ్యవసాయ పరిశోధనలకు గాను కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనను ‘వాల్వో’ బిరుదుతో సత్కరించింది. దేశవిదేశాలకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాలు స్వామినాథన్‌కు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఆయనకు మొత్తం 84 గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. అంతేకాకుండా పీహెచ్‌డి పరిశోధక విద్యార్థులెందరికో మార్గదర్శిగాను సేవలందించారు. దేశంలోని వివిఽధ వైజ్ఞానిక సంస్థల సభ్యుడిగాను ఆయన విశిష్ట సేవలందించారు. వ్యవసాయ రంగంలో పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చిన ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దిన ఎంఎస్ స్వామినాధన్ 90 యేళ్ల వయస్సులోనూ తన పరిశోధనలను కొనసాగిస్తూ వచ్చారు.
అవార్డుల పరంపర...
వ్యవసాయ రంగానికి అందించిన సేవలకుగాను ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను, జాతీయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి పురస్కారాలను అందుకున్నారు. కేంద్రప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ (1967), పద్మభూషణ్ (1972), పద్మవిభూషణ్ (1989) పురస్కారాలతో సత్కరించింది. 1965లో ఆయన తొలిసారిగా ‘మెండెల్ మెమోరియల్ మెడల్’ను జెకోస్లావిక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్‌సైన్స్ అవార్డు, 1987లో తొట్టతొలిసారిగా వరల్డ్ ఫుడ్ అవార్డు, 1991లో పర్యావరణ సంబంధిత టేలర్ బహుమతి, 1995లో ఫిలిప్పైన్స్‌కు చెందిన గోల్డెన్ హార్ట్ పురస్కారం అందుకున్నారు. 33 జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో 32 అవార్డులను స్వీకరించారు.
మానవాళికి దారిదీపం..: నేతల నివాళి
స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆకలిబాధలు లేని, ఆహార భద్రత కలిగిన ప్రపంచాన్ని మానవాళికి అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు దారిచూపే దీపంలాంటి మహత్తర పరిశోధనా వారసత్వాన్ని స్వామినాథన్ వదిలిపోయారని రాష్ట్రపతి నివాళి అర్పించారు. వ్యవసాయ రంగంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు స్వామినాథన్ చేసిన సేవలు లక్షలాదిమంది భారతీయుల జీవితాలనే మార్చివేశాయని ప్రధాని కొనియడారు.