Lalu mutton Dinner: రాహుల్‌కు బీహార్ నుంచి మటన్ తెప్పించి, వండి వడ్డించిన లాలూ

ABN , First Publish Date - 2023-08-05T15:39:11+05:30 IST

మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో పడిన శిక్షపై స్టే ఇస్తూ రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన కొద్దిసేపటకే ఆయనతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఢిల్లీలోని తన కుమార్తె మీసాభారతి ఇంటికి విందు కోసం రాహుల్‌ను ఆహ్వానించారు.

Lalu mutton Dinner: రాహుల్‌కు బీహార్ నుంచి మటన్ తెప్పించి, వండి వడ్డించిన లాలూ

న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరు (Modi Surname) పరువునష్టం కేసులో పడిన శిక్షపై స్టే ఇస్తూ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి సుప్రీంకోర్టు (Supreme Court) ఉపశమనం ఇచ్చిన కొద్దిసేపటకే ఆయనతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) తన సంతోషాన్ని పంచుకున్నారు. ఢిల్లీలోని తన కుమార్తె మీసాభారతి ఇంటికి విందు కోసం రాహుల్‌ను ఆహ్వానించారు. రాహుల్‌కు లాలూ పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం రాహుల్‌ కోసం బీహార్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మటన్‌ను లాలూ స్వయంగా వండి వడ్డించారు.


ఈ విందు కార్యక్రమంలో మీసాభారతితో పాటు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. 26 పార్టీల ఇండియా (INDIA) కూటమిలో కాంగ్రెస్-ఆర్జేడీలు భాగస్వాములు కావడం, విపక్ష పార్టీలన్నీ ముంబైలో ఈ నెల ద్వితీయార్థంలో సమావేశం కానున్న నేపథ్యంలో లాలూ-రాహుల్ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, విందు సమావేశంలో రాజకీయాల గురించి పెద్దగా చర్చకు రాలేదని, విందును ఆస్వాదిస్తూనే చిన్నపాటి సంభాషణలే వారి మధ్య చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. లాలూ ఆరోగ్య పరిస్థితిని ఈ సందర్భంగా రాహుల్ అడిగి తెలుసుకున్నారు.


పార్లమెంటులో రాహుల్ అడుగుపెట్టేదెప్పుడు?

పరువునష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల శిక్ష నేపథ్యంలో ఆయన పార్లమెంటు సభ్యత్వం ఇటీవల రద్దు అయింది. అయితే, సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించడంతో రాహుల్ తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి లోక్‌సభ సెక్రటేరియట్ ఎంత సమయం తీసుకుంటుందనే ప్రస్తుతం ప్రశార్ధకంగా ఉంది. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నంచి చర్చ ప్రారంభం కానుంది. రాహుల్‌ సభ్యత్వాన్ని తక్షణం పునరుద్ధరిస్తే ఆయన ఈ చర్చలో పాల్గొంటారు.

Updated Date - 2023-08-05T15:39:11+05:30 IST