No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. పెట్టేదేదో సరిగ్గా పెట్టొచ్చు కదా అంటూ మోదీ ధ్వజం
ABN , First Publish Date - 2023-08-10T20:19:51+05:30 IST
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే లోక్‌సభలో విపక్షాలు వాకౌట్ చేయడంతో.. ఓటింగ్ లేకుండానే అవిశ్వాసం వీగిపోయింది. అంతకుముందు.. ఈ తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ కొనసాగింది. అధికార, విపక్ష పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కౌంటర్ల వర్షం కురిపించుకున్నారు. చివరగా మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీల్ని ఎండగట్టారు.
2018, 2023లో విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని.. కనీసం పెట్టేదైనా సరిగ్గా పెట్టొచ్చు కదా అని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారనే విషయంపై విపక్షాలకు స్పష్టత గానీ, సంసిద్ధత గానీ లేదని చురకలంటించారు. భవిష్యత్తులో మరోసారి అవిశ్వాసం పెట్టాలని అనుకుంటే.. అప్పుడైనా సంపూర్ణ సింసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. ఈ సభ సభ ప్రజల సొమ్ముతో నడుస్తోందని, కాబట్టి ప్రతీ క్షణం ఎంతో విలువైనదని అన్నారు. ప్రజల ధనాన్ని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని హితవు పలికారు. రాజకీయాలు బయట చేయాలే తప్ప సభలో కాదని.. దేశాభివృద్ధి, సమగ్రత కోసం ఫలవంతమైన చర్చలు జరగాలని.. అందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.
1991లో భారత్ అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని.. కానీ 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందని మోదీ పేర్కొన్నారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే పద్ధతిలో తాము భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని.. తమ పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతామని ఉద్ఘాటించారు. డిజిటల్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు విపక్షాలు అవహేళన చేయాలని.. కానీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో అందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. దేశపు సామార్థ్యం, ప్రజల సామర్థ్యం మీద విపక్షాలకు ఏమాత్రం విశ్వాసం లేదని మండిపడ్డ మోదీ.. అహకంకారంతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని విజృంభించారు.