Jamili Elections: జమిలికి అడ్డంకులు

ABN , First Publish Date - 2023-07-28T02:38:22+05:30 IST

లోక్‌సభ(Lok Sabha), రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు జమిలి ఎన్నికలు(Jamili Elections) నిర్వహించేందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌(Arjunram Meghwal) తెలిపారు.

Jamili Elections: జమిలికి అడ్డంకులు

ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం

రాష్ట్రాల ఏకాభిప్రాయం తప్పనిసరి

ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు భారీ ఖర్చు

అయినా, ఆచరణీయ రోడ్‌ మ్యాప్‌

రూపకల్పనకు లా కమిషన్‌ కసరత్తు

రాజ్యసభలో న్యాయమంత్రి మేఘ్‌వాల్‌

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ(Lok Sabha), రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు జమిలి ఎన్నికలు(Jamili Elections) నిర్వహించేందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌(Arjunram Meghwal) తెలిపారు. అయినా, జమిలి ఎన్నికల నిర్వహణకు ఆచరణీయ రోడ్‌ మ్యాప్‌ రూపొందించే విషయం లా కమిషన్‌ పరిశీలనలో ఉందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌తోపాటు సంబంధిత వర్గాలతో పార్లమెంట్‌ స్థాయూ సంఘం కూడా జమిలి ఎన్నికలపై చర్చించిందని, స్థాయూ సంఘం తన నివేదికలో చేసిన సిఫారసులపై కమిషన్‌ పరిశీలిస్తోందని వివరించారు. గురువారం రాజ్యసభ(Rajya Sabha)లో అన్నాడీఎంకే సభ్యుడు తంబిదురై, బీజేపీ సభ్యుడు కిరోడీలాల్‌ మీనా(Kirodilal Meena) అడిగిన వేర్వేరు ప్రశ్నలకు మేఘ్‌వాల్‌ జవాబిచ్చారు. ‘‘జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుంది. పరిపాలన, శాంతి భద్రతల యంత్రాంగాల పని భారం తగ్గుతుంది. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచారానికి అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. అలాగే, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, వాటికి ఉప ఎన్నికలు(By-elections) తరచూ జరుగుతుండడంతో సుదీర్ఘ కాలం ప్రవర్తనా నియమావళి అమలు చేయాల్సి వస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోంది’’ అని వివరించారు. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఉన్నాయని, ప్రధానంగా ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుందని మంత్రి చెప్పారు.


పార్లమెంట్‌(Parliament) ఉభయ సభల పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్‌ 83, రాష్ట్రపతి ద్వారా లోక్‌సభ రద్దుకు సంబంధించి ఆర్టికల్‌ 85, రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్‌ 172, రాష్ట అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్‌ 356ను సవరించాల్సి ఉంటుందని తెలిపారు. మరీ ముఖ్యంగా, అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలని, ముఖ్యంగా దేశంలో సమా ఖ్య పాలన వ్యవస్థ ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధించడం తప్పనిసరి అని వివరించారు. మరోవైపు, అత్యధికంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు అదనంగా సేకరించాల్సి ఉంటుందని, అందుకు భారీ మొత్తం ఖర్చవుతుందని చెప్పారు. ఇక పోలీసు సిబ్బంది, భద్రతా దళాలు కూడా అదనంగా అవసరమవుతాయని చెప్పారు. అయితే, దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేళ్లకూ జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, రెండు సంవత్సరాల తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతాయని స్థాయూ సంఘం తన 79వ నివేదికలో తెలిపిందని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. స్వీడన్‌లో నాలుగేళ్లకోసారి జాతీయ అసెంబ్లీ, స్థానిక అసెంబ్లీ, స్థానిక సంస్థలకు సెప్టెంబర్‌లో రెండో శనివారం రోజు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, యూకేలో పార్లమెంట్‌కు పదవీ కాలం స్థిరంగా ఉండేందుకు 2011లో చట్టం చేశారని ఈ నివేదిక తెలిపింది.

Updated Date - 2023-07-28T05:20:00+05:30 IST