Pakistan blast: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉంది: మంత్రి సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-10-01T09:28:05+05:30 IST
నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం.
లాహోర్: నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం. శుక్రవారం తమ దేశంలో జరిగిన రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ( (RAW) ప్రమేయం ఉందని శనివారం పాకిస్థాన్ ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో శనివారం మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం (RAW) ప్రమేయం ఉందని పేర్కొన్నారు. "సివిల్, మిలిటరీ, అన్ని ఇతర సంస్థలు సంయుక్తంగా మస్తుంగ్ ఆత్మాహుతి బాంబు దాడిలో పాల్గొన్న అంశాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తాయి. ఆత్మాహుతి దాడిలో RAW ప్రమేయం ఉంది" అని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు. పాక్ మంత్రి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రానున్న కాలంలో రెండు దేశాల పెను దుమారాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. మరోవైపు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఎను విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు శనివారం నివేదికను సమర్పించారు. ఇక శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 65కు చేరింది.
అసలు ఏం జరిగిందంటే.. శుక్రవారం నాడు బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో మదీనా మసీదు సమీపంలో జరిగిన ఘోర ఆత్మాహుతి పేలుడులో ఇప్పటివరకు మొత్తం 60 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈద్-ఇ-మిలాద్ ఊరేగింపు కోసం పెద్దఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని హంగూలో పోలీస్ స్టేషన్ మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన రెండవ బాంబు దాడిలో, పేలుడు తాకిడికి మసీదు పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై శనివారం డాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తిపై హత్య ఆరోపణలు, ఉగ్రవాద నేరాలతో కూడిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదని తెలిపింది. అయితే పాకిస్తాన్‌లో జరిగిన కొన్ని రక్తపాత దాడులకు కారణమైన నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తన ప్రమేయాన్ని ఖండించింది అని చెప్పింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సీటీడీ (CTD) తెలిపింది. కాగా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలూచిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.