PM Kisan : పీఎం కిసాన్ మరో రూ.2వేలు?
ABN , First Publish Date - 2023-10-12T03:33:56+05:30 IST
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని రైతులకు ఏటా అందిస్తున్న నగదు సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రైతన్నలకు ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6వేలు వారి

ఆర్థిక సాయం పెంచే యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 11: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని రైతులకు ఏటా అందిస్తున్న నగదు సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రైతన్నలకు ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6వేలు వారి ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.8వేలకు పెంచాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పెంచితే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పీఎం కిసాన్ సొమ్మును పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు నిర్ణయం తీసుకుంటే అదనంగా ఓట్లను సంపాదించుకునే ఆస్కారం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నగదు సాయాన్ని పెంచడం వల్ల ప్రభుత్వం ఆమేరకు ఆర్థిక భారం కూడా మోయాల్సి వస్తుంది. వార్షికంగా రూ.8వేలు ఇచ్చినట్టయితే అదనంగా రూ.20,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2.42 లక్షల కోట్లు ఇచ్చారు. కాగా రైతులకు 15వ విడత పీఎం కిసాన్ సొమ్ము అందాల్సి ఉంది. ఈ మొత్తం నవంబరు 30లోపు ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సొమ్ము పెంపునకు సంబంధించి ప్రకటన వెలువడుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.