G20 Summit: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం.. మోడీ, రిషి సునాక్ అంగీకారం

ABN , First Publish Date - 2023-09-09T22:16:40+05:30 IST

భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్‌లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు...

G20 Summit: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం.. మోడీ, రిషి సునాక్ అంగీకారం

భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్‌లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాయి. జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా.. ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తాను, ప్రధాని మోదీ కలిసి.. సమగ్రమైన & ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం ముగియడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎట్టకేలకు.. ఊహించినట్టుగానే జీ20 సమ్మిట్‌లో ఈ ఒప్పందంపై పని చేసేందుకు మోదీ, రిషి అంగీకారం తెలిపారు.


జీ20 సమ్మిట్‌లో భాగంగా.. రిషి సునాక్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తొలుత.. భారత్ జీ20 ప్రెసిడెన్సీ సమయంలో యూకే మద్దతు తెలిపినందుకు గాను రిషి సునాక్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 2030 రోడ్‌మ్యాప్.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, రక్షణ & భద్రత, సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీ, వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో పురోగతి గురించి ఇద్దరు నాయకులు చర్చించుకున్నారు. అలాగే.. భారత్ & యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సహకారం కలిగి ఉండటం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తిగా ఉన్నట్టు తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల ప్రాముఖ్యతతో పాటు పరస్పర ప్రయోజనాలపై కూడా మోదీ, రిషి తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అనంతరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి.. సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సంతకం చేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత వివరణాత్మక చర్చ కోసం.. పరస్పర అనుకూలమైన తేదీలో ద్వైపాక్షిక పర్యటన కోసం భారత్‌కు రావాల్సిందిగా సునాక్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన సునాక్.. విజయవంతమైన G20 సమ్మిట్ ప్రధాని మోదీని అభినందించారు. కాగా.. యూకే ప్రధాని అయిన తర్వాత రిషి సునాక్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-09-09T22:16:40+05:30 IST