Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. చారిత్రక నిర్ణయాలుంటాయన్న మోదీ.. మహిళా బిల్లుకు ఆమోదం?
ABN , First Publish Date - 2023-09-18T19:54:51+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీ అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని...
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీ అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, కొత్త బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా.. మహిళా బిల్లుకు ఆమోదం తెలుపొచ్చని, అలాగే ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. కేబినెట్ భేటీ అజెండాను మంత్రులకు కూడా మోదీ చెప్పలేదు. పార్లమెంటు ఆవరణలోనే ఈ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీలోనే రహస్య అజెండాను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ కేబినెట్ భేటీ కంటే ముందు ప్రధాని మోదీ కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ముందుగా అమిత్ షాను కలిసిన మోదీ.. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌ని కలిశారు. ప్రహ్లాద్ జోషి గదిలో జరిపిన చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ ఉన్నారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. మరోవైపు.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యమన్న మోదీ.. నూతన పార్లమెంట్‌లో భారత అభివృద్ధికి అనుగుణమైన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దీంతో.. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలుంటాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలావుండగా.. ఐదు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ & రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023, పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు & పదవీకాలం) బిల్లు 2023, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లు, SC/ST ఆర్డర్‌కు సంబంధించిన మూడు బిల్లులపై చర్చ జరగనున్నట్టు వెల్లడించారు. అటు.. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు, ఇండియాను భారత్‌గా పేరు మార్చే తీర్మానం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.