Cops Leave Cancelled: ఇప్పటికే మంజూరు చేసిన సెలవులు రద్దు చేయడమే కాకుండా, ఏప్రిల్ 14 వరకూ..
ABN , First Publish Date - 2023-04-07T14:02:59+05:30 IST
పంజాబ్ రాష్ట్ర పోలీసులకు ఈనెల 14వ తేదీ వరకూ లీవులు రద్దు చేశారు. రాష్ట్ర పోలీసులకు పట్టుబడకుండా
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర పోలీసులకు ఈనెల 14వ తేదీ వరకూ లీవులు రద్దు (Leaves Cancelled) చేశారు. రాష్ట్ర పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల నేత అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఈనెల ద్వితీయార్థంలో సిక్కు నేతలతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న వైశాఖి (Baisakhi) ఉత్సవం సందర్భంగా 'సర్బత్ ఖల్సా' ఏర్పాటు చేయాలని అమృత్‌పాల్ కోరినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. గెజిటెట్, నాన్ గెజిటెడ్ అధికారుల సెలవులను రద్దు చేసినట్టు అధికారులకు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గౌరవ్ యాదవ్ ఒక సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులు రద్దు చేయడమే కాకుండా, ఏప్రిల్ 14 వరరూ కొత్త సెలవులు ఇవ్వరాదని పోలీసు శాఖాధిపతులకు ఆయన ఆదేశాలిచ్చారు.
అఖల్ తక్త్ సమావేశానికి వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ పంపినట్టు చెబుతున్న రెండు వీడియాలు ఇప్పటికే వెలుగు చూశాయి. వైశాఖి సందర్భంగా అమృత్‌సర్‌లోని అకల్ తఖ్త్ నుంచి బటిండాలోని డండమ సాహిబ్ వరకూ ఊరేగింపు జరపాలని అకల్ తఖ్ చీఫ్‌లను అమృత్‌పాల్ కోరారు. అయితే దీనిపై అకల్త్ తఖ్ చీఫ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శఇ గురుచరణ్ సింగ్ గ్రెవాల్ తెలిపారు. చివరిసారిగా షర్బత్ ఖల్సా కాంగ్రిగేషన్ 1986 ఫిబ్రవరి 16లో జరిగింది.
మరోవైపు, గత మార్చి 18 నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న 'వారిస్ పంజాద్ దే' చీఫ్ అమృత్‌పాల్.. అమృత్‌సర్ స్వర్ణాలయం వద్ద లొంగిపోయినట్టు వినిపిస్తున్న ఊహాగానాలను శాంతిభద్రతల విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ గత శనివారం తోసిపుచ్చారు. అమృత్‌పాల్ లొంగిపోవాలని కోరుకుంటే చట్టప్రకారం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని, పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.