Adani-Hindenburg row: అదానీ గ్రూప్‌పై సెబీ దర్యాప్తులో కీలక పరిణామం

ABN , First Publish Date - 2023-04-29T21:48:16+05:30 IST

అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల

Adani-Hindenburg row: అదానీ గ్రూప్‌పై సెబీ దర్యాప్తులో కీలక పరిణామం
Gautam Adani

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు కావాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) శనివారం సుప్రీంకోర్టును కోరింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు తాజా వివరాలను, ప్రాథమికంగా గుర్తించిన అంశాలను నిపుణుల కమిటీకి సమర్పించినట్లు తెలిపింది.

క్రింది అంశాల్లో ఉల్లంఘనలు జరిగాయేమో దర్యాప్తు చేసేందుకు అదనపు సమయం కావాలని సుప్రీంకోర్టును సెబీ కోరింది.

1. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్సన్స్ (RPT) డిస్‌క్లోజర్స్

2. కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధిత అంశాలు

3. షేర్ ధరలు

4. ఎఫ్‌పీఐ రెగ్యులేషన్స్

5. మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలు

6. ఓడీఐ నిబంధనలు

7. ఇన్‌సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్/FUTP నిబంధనలు

8. షార్ట్ సెల్లింగ్ నిబంధనలు

అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు, వాటి అనుబంధ కంపెనీలపై నిఘా ఉంది. రికార్డులు, సమాచారాన్ని సమర్పించాలని ఈ కంపెనీలను కోరారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ సమస్య చాలా జఠిలమైనదని, అందువల్ల ఈ లావాదేవీలపై దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం 15 నెలల సమయం అవసరమని సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే దీనిని ఆరు నెలల్లో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. లావాదేవీల్లో మోసాలు, షేర్ ధరల అక్రమాలు వంటివాటికి పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చినప్పటికీ, ఈ నివేదిక తర్వాత అదానీ ఆస్తుల విలువ బాగా తగ్గిపోయింది. ఈ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మార్చి 2న సెబీకి జారీ చేసిన ఆదేశాల్లో అదానీ గ్రూప్‌పై దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని తెలిపింది. అంతేకాకుండా అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించేందుకు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బ్యాంకర్లు, జడ్జిలు, న్యాయవాది, టెక్నాలజీలో నిపుణులు ఉన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు. స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ మెకానిజం నిబంధనావళిని ఈ కమిటీ సమీక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష

Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-29T21:48:16+05:30 IST