Shashi Tharoor: మహువా మొయిత్రాపై బహిష్కరణ మంచి సంకేతమే.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-12-08T20:58:48+05:30 IST
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై బహిష్కరణ వేటుపడటంపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విపక్షాల ఐక్యతకు ఇది మంచిదేనని వ్యాఖ్యానించారు. మరింత భారీ మెజారిటీతో ఆమె తిరిగి ఎన్నికవుతారని అన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణపై టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటుపడటంపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విపక్షాల ఐక్యతకు ఇది మంచిదేనని వ్యాఖ్యానించారు. మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయడం ఆమెకే మేలు చేస్తుందన్నారు. మరింత భారీ మెజారిటీతో ఆమె తిరిగి ఎన్నికవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో మహుతా మెయిత్రా తన సమీప బీజేపీ ప్రత్యర్థి కల్యాణ్ చౌబేపై 60,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొయిత్రాపై తొలుత ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వివాదానికి దూరంగా ఉన్న టీఎంసీ క్రమంగా మెహువా వెనుకే పార్టీ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యత్వంపై మొయిత్రాపై వేటు వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ సహా విపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి.
నా వయసు 49, మరో 30 ఏళ్లు పోరాడతా..
లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరిస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించిన అనంతరం పార్లమెంటు వెలుపల మెయిత్రా మాట్లాడుతూ, ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని, తమను అణగదొక్కేందుకు ఈ కమిటీని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన నిరాధార మాటలు నమ్మ తనను దోషిగా నిర్ధారించడం సరికాదన్నారు. తన వయస్సు ఇప్పుడు 49 మాత్రమేనని, మరో 30 ఏళ్లు తాను పోరాడతానని బీజేపీకి సవాలు విసిరారు. పార్లమెంటు లోపల, బయట తన పోరాటం ఆగదని చెప్పారు. ''మీ అంతు చూస్తాం. ఇది మీ అంతానికి ఆరంభం. మళ్లీ తిరిగి రాబోతున్నాం. మీ అంతు చూసితీరుతాం'' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.